ఏపిలో కర్నూలు జిల్లాలో గల శ్రీశైలం, నల్లగొండ జిల్లాలోగల యాదాద్రి పుణ్యక్షేత్రాలకి టిఎస్ఆర్టీసి ఆరు వజ్రాలను సిద్దం చేసింది. అంటే వజ్ర ఏసీ బస్సులన్న మాట! ఇకపై ప్రతీరోజు రెండు పుణ్యక్షేత్రాలకు చెరో మూడు వజ్రబస్సులను నడుపబోతున్నట్లు రంగారెడ్డిజిల్లా ఆర్టీసీ రీజియనల్ మేనేజర్ యాదగిరి తెలిపారు. సోమవారం వీటికి శాసనసభ్యుడు జి.సాయన్న పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ బస్సులు జూబిలీ బస్టాండ్ నుంచి బయలుదేరుతాయి. యాదాద్రికి తెల్లవారు జామున 5 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు మొత్తం 12 సర్వీసులుంటాయి. వీటి టికెట్ ధర రూ.120 గా నిర్ణయించారు.
శ్రీశైలం వెళ్ళే మొదటి బస్సు తెల్లవారుజామున 5 గంటలకు జూబ్లీ బస్టాండ్ నుంచి బయలుదేరుతుంది. కొన్ని గంటల వ్యవధితో రాత్రి 9గంటలలోగా మిగిలిన రెండు బస్సులు బయలుదేరుతాయి. శ్రీశైలానికి వజ్రబస్సు టికెట్ ధర రూ.470గా నిర్ణయించారు.
వజ్ర ఏసి బస్సులలో ప్రయాణికులకు మంచినీళ్ళ బాటిల్స్ అందిస్తున్నామని, అలాగే వారి కాలక్షేపం కోసం బస్సులలో టీవి ఏర్పాటు చేసినట్లు రీజియనల్ మేనేజర్ యాదగిరి చెప్పారు. ఒక్కో బస్సులో 18 మంది ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు. కనుక అందరూ హాయిగా కూర్చొని ప్రయాణించవచ్చు. ఈ బస్సు టికెట్లు జూబ్లీ బస్టాండ్, ఎంజిబిఎస్ లతో పాటు నగరంలో వివిధ ప్రాంతాలలో ఉన్న ఆర్టీసి రిజర్వేషన్ కౌంటర్లలో లభిస్తాయి. వాటితో పాటు www.tsrtconline.in లో కూడా ముందుగానే రిజర్వేషన్ చేసుకోవచ్చునని తెలిపారు. అలాగే శుభకార్యాలకు, తీర్ధయాత్రలకు వజ్రా బస్సులను కిమీకు రూ.30 చొప్పున చెల్లించి అద్దెకు తీసుకోవచ్చునని రీజియనల్ మేనేజర్ యాదగిరి తెలిపారు.