టిఫిన్స్ ఫస్ట్...నిరాహారదీక్ష నెక్స్ట్

దళితులపై దాడులను, మోడీ సర్కార్ తీరును నిరసిస్తూ సోమవారం కాంగ్రెస్ పార్టీ నేతలందరూ దేశవ్యాప్తంగా ఒక్కరోజు నిరాహార దీక్షలు చేశారు. డిల్లీలో సీనియర్ కాంగ్రెస్ నేతలు దీక్షకు ముందు ఒక హోటల్ కు వెళ్ళి కడుపు నిండా టిఫిన్స్ చేస్తుండగా ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దానిపై భాజపా నేత హరీష్ కరుణ స్పందిస్తూ, “ప్రజల దృష్టిలో వారు నిరాహార దీక్ష చేస్తున్నారు. కానీ వారు దీక్షకు కూర్చొనే ముందు రెస్టారెంటుకు వెళ్ళి ‘చోళే భటూరే’ తింటున్నారు. కాంగ్రెస్ నేతల ద్వంద వైఖరికి ఇదే మంచి నిదర్శనం.భూటకపు దీక్షలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు” అని ట్వీట్ చేశారు. 

రెస్టారెంటులో తమ అల్పాహారం చేసిన సంగతి మీడియాకు పొక్కడంతో కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించక తప్పలేదు. కాంగ్రెస్ నేత ఏఎస్ లవ్లీ మీడియాతో మాట్లాడుతూ, “సాధారణంగా నిరాహారదీక్ష అంటే ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు చేస్తుంటారు. కనుక ఉదయం 8గంటల కంటే ముందు కాస్త అల్పాహారం చేస్తే తప్పేమిటి? అయినా భాజపా నేతలకు మేము ఏమి తింటున్నామో ఏమి చేస్తున్నామో చూడటమే తప్ప దేశప్రజల అవసరాలేమితో తెలుసుకొనే ఆసక్తిలేదు,” అని అన్నారు. 

ఈ రోజులలో నిరాహార దీక్షలను ఎవరూ నమ్మడం లేదు. కారణం ఇదే. ఒకవేళ కాంగ్రెస్ నేతలు టిఫిన్ చేయదలిస్తే ఎవరి ఇళ్ళలో వారు కడుపార టిఫిన్స్ చేసివస్తే ఈవిధంగా ఎవరికీ చిక్కేవారు కారు. కానీ నిరాహార దీక్ష చేస్తున్నామని గొప్పగా ప్రకటించుకొన్నాక దారిలో హోటల్ కు వెళ్ళి అందరూ చూస్తుండగానే అల్పాహారం చేస్తూ దొరికిపోయి నవ్వులపాలయ్యారు. ఒక్కరోజు నిరాహారదీక్షలే ఈవిధంగా చేస్తుంటే మరి ఆమరణ నిరాహార దీక్షలు ఏ రేంజ్ లో చేస్తారో!