కాంగ్రెస్ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ వేసిన పిటిషన్స్ పై నేడు హైకోర్టు విచారణ జరిపింది. అయితే ప్రభుత్వం తరపు వాదించిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు ఇవ్వాళ కూడా శాసనసభ వీడియో ఫుటేజిని హైకోర్టుకు సమర్పించలేదు. కాంగ్రెస్ శాసనసభ్యుల సభ్యత్వం రద్దు విషయంలో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధమూ లేదని చెప్పారు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ శాసనసభ కార్యదర్శిగానీ ఇద్దరు కాంగ్రెస్ సభ్యుల సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేశారో కారణం తెలుపలేదనే సంగతి హైకోర్టుకు గుర్తుచేశారు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు నేటితో ముగిసినట్లు ప్రకటించిన న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ లో ఉంచి కేసును వాయిదా వేస్తున్నట్లు తెలియజేశారు.
ఈ కేసులో కాంగ్రెస్ సభ్యులిద్దరూ నేరం చేసినట్లు నిరూపించే ఆధారాలేవీ ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించలేదు. పైగా ఈ కేసుతో ప్రభుత్వానికి సంబంధం లేదని అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు వాదించారు. ఒకవేళ వీడియో ఫుటేజిని సమర్పించకపోతే, ఇరు పక్షాల వాదోపవాదాల ఆధారంగా తీర్పు చెపుతామని హైకోర్టు ఇదివరకే స్పష్టం చేసింది. కనుక ఈ కేసులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లకు అనుగుణంగా తీర్పు వస్తుందేమో?