కొంపల్లిలో తెరాస ప్లీనరీ

తెరాస వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న హైదరాబాద్ కొంపల్లిలోని జిబిఆర్ కల్చరల్ సెంటర్ లో తెరాస ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. దీనికి సుమారు 15,000 మంది తెరాస నేతలు, కార్యకర్తలను ఆహ్వానించబోతున్నారు. ప్లీనరీ సమావేశాల ఏర్పాట్ల కోసం ఒకటి రెండు రోజులలో ముఖ్యమంత్రి కెసిఆర్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. వాటిలో తీర్మానాల కమిటీకి రాజ్యసభ కే కేశవ్ రావు అధ్యక్షుడుగా ఉండబోతున్నారని సమాచారం.

ఈసారి ప్లీనరీ సమావేశాలను ఎక్కువ హడావుడి చేయకుండా నిర్వహించి, ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నెలలలో బారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటికి సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడతాయి కనుక 25 లక్షల మందితో అట్టహాసంగా సభను నిర్వహించి తెరాస సత్తా యావత్ దేశానికి తెలిసేలా చేయాలని కెసిఆర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పధకాల లబ్దిదారులందరినీ ఆ బహిరంగ సభకు ఆహ్వానించాలని నిర్ణయించారు. తద్వారా రాష్ట్రంలో ప్రభుత్వ పధకాలు విజయవంతంగా అమలవుతున్నాయనే చాటిచెప్పవచ్చు. 

ఇక ఈ బహిరంగ సభకు జాతీయపార్టీల నేతలను కూడా ఆహ్వానించి, ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై ప్రజలకు స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్ సమీపంలో ఇబ్రహీంపట్నం లేదా మేడ్చల్ అవుటర్ రింగ్ రోడ్డు వద్ద ఈ బహిరంగసభను నిర్వహించాలని తెరాస భావిస్తోంది. తెరాస నేతలు ఆ రెండు స్థలాలను పరిశీలించిన తరువాత బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలనేది ఖరారు చేస్తారు. దానికి ఇంకా చాలా సమయం ఉంది కనుక ముందుగా ప్లీనరీ సమావేశాలు విజయవంతం చేయడానికి తెరాస నేతలు అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించారు.