కాంగ్రెస్, తెరాస నేతలు తరచూ పరస్పర విమర్శలు చేసుకొంటూనే ఉంటారు. కానీ సీనియర్ కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి వాటిలో ఎక్కువగా తలదూర్చరు. కానీ నోరు విప్పితే మాత్రం ముఖ్యమంత్రిని కూడా ఉపేక్షించరు. మళ్ళీ చాలా రోజుల తరువాత మీడియాతో మాట్లాడిన అయన ముఖ్యమంత్రి కెసిఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. “మోడీ సర్కార్ పై దేశవ్యాప్తంగా వ్యతిరేకత కనబడుతున్నప్పటికీ ముఖ్యమంత్రి కెసిఆర్ మోడీతో దోస్తీ వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. భాజపాకు తెరాస తోకపార్టీలాగ మారిపోయింది. లోక్ సభలో ప్రతిపక్షాలు పెడుతున్న అవిశ్వాస తీర్మానాలను తెరాస ఎంపిలచేత అడ్డుకొని మోడీ సర్కార్ ను కాపాడే బాధ్యత భుజానికెత్తుకొన్నారు. ఒకపక్క మోడీ సర్కార్ కు అండగా నిలబడుతూనే మరోపక్క భాజపాకు వ్యతిరేకంగా ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని కెసిఆర్ చెపుతున్న మాటలను ఎవరూ నమ్మడం లేదు. అందుకే అయన ప్రతిపాదనకు సరైన స్పందన లభించలేదు. ధర్డ్ ఫ్రంట్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ముందు అయన ఎవరి పక్షమో నిర్ణయించుకొంటే మంచిది. భాజపావంటి మతతత్వపార్టీతో అంటకాగుతున్న కెసిఆర్ ను నమ్మవద్దని మైనార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.