కోమటిరెడ్డి కేసు: తాజా అప్ డేట్స్

కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ శాసనసభ్యత్వ రద్దు కేసులో హైకోర్టు నుంచి నోటీసులు అందుకొన్న కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కౌంటర్లు దాఖలు చేశాయి. కోర్టు ఆదేశాల ప్రకారం ఆరు వారాలపాటు వారిరువురి నియోజకవర్గాలలో ఉపఎన్నికలు నిర్వహించబోమని, అటువంటి ప్రయత్నాలు కూడా చేయడం లేదని, కానీ ప్రజాప్రాతినిధ్య చట్ట ప్రకారం ఖాళీ అయిన నియోజకవర్గంలో ఆరు నెలలోగా ఉపఎన్నికలు జరిపించవలసి ఉంటుందని ఎన్నికల సంఘం తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. కనుక తమను ఈ కేసు నుంచి తప్పించాలని కోరారు. 

ఇక ఈ కేసులో రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్ రావు ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసుతో రాష్ట్ర ప్రభుత్వానికి, న్యాయ శాఖకు, శాసన వ్యవహారాల శాఖకు ఎటువంటి సంబంధమూ లేదని, పిటిషనర్లు రాజకీయ దురుదేశ్యంతోనే వాటిని ప్రతివాదులుగా చేర్చారని వాదించారు.

ఈ కేసులో ఎన్నికల సంఘం వాదన సహేతుకంగానే ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వమే మొదటి నుంచి తడబడుతున్నట్లు కనబడుతోంది. కాంగ్రెస్ శాసనసభ్యులు ఇద్దరు దోషులని నిరూపించే వీడియో ఫుటేజి హైకోర్టు సమర్పిస్తామని మొదట చెప్పింది. కానీ ఆ తరువాత ఈ వ్యవహారం శాసనసభ పరిధిలోని అంశం కనుక హైకోర్టు దీనిలో జోక్యం చేసుకోలేదని వాదించింది. ఇప్పుడు ఈ కేసుతో రాష్ట్ర ప్రభుత్వానికి, న్యాయ శాఖకు, శాసన వ్యవహారాల శాఖకు ఎటువంటి సంబంధమూ లేదని వాదిస్తున్నారు. 

ఈ కేసుతో ప్రభుత్వానికి, శాసనసభ వ్యవహారాలు, న్యాయశాఖకు సంబంధంలేకపోతే మరి హైకోర్టు అడుగుతున్న ప్రశ్నలకు ఎవరు సమాధానం చెపుతారు? కాంగ్రెస్ శాసనసభ్యులపై ఎవరు, ఎందుకు చర్య తీసుకొన్నట్లు? వారు ఎవరిని ప్రశ్నించాలి?

ఏప్రిల్ 9న హైకోర్టు మళ్ళీ ఈ కేసు విచారణను చేపట్టబోతోంది. కనుక ఆరోజు ఈ కేసుపై స్పష్టత రావచ్చు. ఈ కేసుతో ఎవరికీ సంబంధం లేదని ప్రభుత్వం వాదిస్తోంది కనుక కాంగ్రెస్ శాసనసభ్యులు ఇద్దరూ నిర్దోషులని హైకోర్టు ప్రకటించి వారి శాసనసభ్యత్వాలను పునరుద్దరించినా ఆశ్చర్యం లేదు. అప్పుడు ప్రభుత్వానికి ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసిరావచ్చు.