నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం

నల్గొండ జిల్లాలో పిఏపల్లి మండలం వద్దిపట్ల వద్ద ఘోర ప్రమాదం జరిగింది. పడమటి తండాకు చెందిన 30 మంది మహిళా కూలీలు పులిచర్లలోని మిరపచేనులో పని చేయడానికి ట్రాక్టరులో వెళుతున్నప్పుడు, ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న ఏఎంఆర్ కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మహిళలు చనిపోగా మరో ముగ్గురి ఆచూకీ లభించలేదు. మిగిలినవారు సురక్షితంగా బయటపడగలిగారు. శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మృతులందరూ వద్దిపట్లలోని పడమటి తండాకు చెందిన ఆదివాసీ మహిళలే.

చనిపోయినవారి పేర్లు: రమావత్ సోనా (70), రమావత్ జీజా (65), రమావత్ కేలీ (50), రమావత్ కంస్లి (50), రమావత్ భారతి (35), రమావత్ సునీత (30), జరుకుల ద్వాలి (30), రమావత్ లక్ష్మి, బానావత్ బేరి (55).

ఈ సంగతి తెలిసిన వెంటనే పోలీసులు,అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని సహాయచర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు గాయపడ్డారు. వారిని దేవరకొండలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన ముగ్గురి ఆచూకీ కనిపెట్టడానికి కాలువలో గజ ఈతగాళ్ళు గాలిస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని సమాచారం.