అప్పుడే సమస్యలు షురూ?

తెలంగాణా రైతు సమన్వయ సమితులలో కేవలం తెరాస నేతలు, కార్యకర్తలకే చోటు కల్పించడాన్ని ప్రతిపక్షాలు తప్పు పట్టినప్పుడు, ముఖ్యమంత్రి కెసిఆర్ వారికి శాసనసభలో సమాధానం చెపుతూ, “యస్! సమితులలో తెరాస నేతలు, కార్యకర్తలు ఉన్నప్పుడే వాటి ద్వారా ప్రభుత్వ పధకాలను సమర్ధంగా అమలుచేయగలుగుతాము. అదే ప్రతిపక్షాలవారు సభ్యులుగా ఉన్నట్లయితే వారు మాకు సహకరించరు కదా. కనుక ఉద్దేశ్యపూర్వకంగానే సమితులలో తెరాస నేతలను, కార్యకర్తలకు చోటు కల్పించాము,” అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అయితే తెలంగాణా రైతు సమన్వయ సమితిలలో అందరూ తెరాసకు చెందినవారే ఉన్నారు కనుక అవి చాలా బాధ్యాతయుతంగా పనిచేస్తాయనుకొంటే పొరపాటేనని అప్పుడే దాఖలాలు కనిపిస్తున్నాయి. 

వ్యవసాయశాఖామంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి నిన్న కామారెడ్డి జిల్లా కేంద్రంలో మండల, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. సమన్వయ సమితులు ఏర్పాటు చేసి అప్పుడే నెలరోజులు అవుతోంది. కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా గ్రామస్థాయిలో సమన్వయ సమితి సమావేశాలు నిర్వహించలేదని తెలుసుకొని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 19వ తేదీ నుంచి ఆ సమితుల ద్వారానే పంట పెట్టుబడికి ఎకరాకు రూ.4,000 చొప్పున ప్రభుత్వం చెక్కులు అందించబోతోంది. కానీ ఇంతవరకు సమితి సభ్యులు సమావేశమే కాలేదు. 

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పధకాన్ని విజయవంతం చేసి చూపాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఏరికోరి తెరాస కార్యకర్తలను సమితులలో సభ్యులుగా నియమిస్తే వారు ఇంత బాధ్యాతారహితంగా వ్యవహరించడం పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కనుక ఇకనైనా సమితి సభ్యులు అందరూ ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించుకొంటూ ప్రతీ గ్రామంలో రైతులకు సంబందించిన ప్రతీ సమస్యపై చర్చించి రాష్ట్ర స్థాయి సమితి దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి కోరారు. 

రాష్ట్రంలో రైతుల సమస్యల పరిష్కారం కోసమే రైతు సమన్వయ సమితిలు ఏర్పాటు చేసి అందుకు అవసరమైన నిధులు, సహాయ సహకారాలు అందిస్తున్నప్పుడు, సమితులలో సభ్యులు కూడా బాధ్యత తీసుకోవలాని మంత్రి పోచారం కోరారు. అనంతరం వ్యవసాయశాఖ, , మత్స్యశాఖలకు సంబంధించిన రైతు సంక్షేమ కార్యక్రమాల వాల్ పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు.