ఇంతకాలం టిజెఎసికి చైర్మన్ గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ కోదండరాం నేటి నుంచి పూర్తిస్థాయి రాజకీయ నాయకుడుగా మారారు. అయన నేతృత్వంలో ఏర్పాటు చేయబోతున్న రాజకీయ పార్టీ పేరు తెలంగాణా జన సమితి (టిజెఎస్) అని సోమవారం హైదరాబాద్ లో ప్రకటించారు.
తెలంగాణా కోసం కొట్లాడిన తెరాసయే అధికారంలోకి వచ్చినప్పటికీ, ప్రజల ఉద్యమ ఆకాంక్షలు నేరవేరలేదని కనుక అనివార్య పరిస్థితులలోనే తాను రాజకీయ ప్రవేశం చేయవలసివచ్చిందని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెరాస ప్రభుత్వంలో మంత్రులకు ఎటువంటి అధికారాలు లేవని వారంతా పేరుకే మంత్రులని అధికారాలన్నీ కెసిఆర్ గుప్పిట్లోనే ఉన్నాయని అన్నారు. మంత్రుల ప్రమేయం లేకుండానే ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులతో ప్రగతి భవన్ లో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సచివాలయంలో అడుగుపెట్టకుండా ఇంట్లో నుంచే రాష్ట్రాన్ని పాలిస్తున్నారని అన్నారు. దేశంలో సచివాలయానికి రాని ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక్కరేనని ఎద్దేవా చేశారు. కెసిఆర్ సచివాలయానికి రారు..ఆ కారణంగా మంత్రులకు ఆయన ధర్మదర్శనం లభించదని కోదండరాం ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నియంతృత్వ, అప్రజాస్వామిక పరిపాలన సాగుతోందని, దానిని తొలగించి మళ్ళీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ పార్టీ లక్ష్యమని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
ఏప్రిల్ 4న పార్టీ జెండాను ఆవిష్కరిస్తామని మరుసటి రోజు నుంచి పార్టీ పరంగా సభలు సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. ఏప్రిల్ 29వ తేదీన హైదరాబాద్ లో పార్టీ అవిర్భావసభ నిర్వహిస్తామని చెప్పారు. వివిధ పార్టీల నుంచి నేతలు టిజెఎస్ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని పార్టీ ఆవిర్భావ సభ రోజున దీనిపై స్పష్టత రావచ్చని ఆశిస్తున్నట్లు ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు.