అందుకే అయన రాజీనామా: ఉత్తమ్ కుమార్ రెడ్డి

టి-కాంగ్రెస్ రెండవ విడత బస్సు యాత్ర నిన్నటి నుంచి ప్రారంభించింది. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “తెరాస సర్కార్ అవినీతికి పాల్పడుతోందని మేము చేస్తున్న ఆరోపణలు నిజమని కాగ్ నివేదిక దృవీకరించింది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇంతకాలం చెపుతున్న మాటలలో నిజానిజాలను కాగ్ నివేదిక బయటపెట్టింది. తెరాస సర్కార్ బడ్జెట్ లో తప్పుడు లెక్కలు చూపించినట్లు కాగ్ పేర్కొంది. శాసనసభను కూడా తప్పుదారి పట్టిస్తునందుకు కాగ్ నివేదిక ఆధారంగా మేము తెరాస సర్కార్ పై హైకోర్టులో ఒక పిటిషన్ వేయబోతున్నాము,” అని చెప్పారు. 

కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లపై అసత్య ఆరోపణలు చేసి వారి శాసనసభ్యత్వం రద్దు చేసిన తెరాస సర్కార్ హైకోర్టులో దానిని నిరూపించలేక తడబడుతోందని అన్నారు. వారు దోషులని నిరూపించే వీడియో ఫుటేజిని హైకోర్టు ఇవ్వలేకనే అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి రాజీనామా చేయవలసి వచ్చిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

మంత్రి కేటిఆర్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నాడని, అయన తన నోటిని అదుపులో ఉంచుకొని మాట్లాడాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. 

తాము చేపడుతున్న బస్సు యాత్రలో ముఖ్యమంత్రి కెసిఆర్, స్పీకర్ మధుసూధనాచారి శాసనసభలో వ్యవహరిస్తున్న తీరు గురించి, తమ ఇద్దరు శాసనసభ్యులకు జరిగిన అన్యాయం గురించి వివరిస్తామని చెప్పారు.       రాష్ట్ర ప్రజలను, శాసనసభను తప్పుదారి పట్టిస్తున్న కెసిఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగడం రాష్ట్రానికి ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కెసిఆర్ నియంతృత్వ, అవినీతి పాలనతో రాష్ట్ర ప్రజలు విసుగెత్తిపోయున్నారని వచ్చే ఎన్నికలలో వారు తెరాసను గద్దె దించి కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించడం ఖాయమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ ఏడాది డిసెంబరులోగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.