ప్రజా సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కేవలం ఒక ప్రభుత్వాధినేతగా మాత్రమే ఆలోచించకుండా మానవతాదృక్పధంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకొంటారని అనేకసార్లు నిరూపితమైంది. అటువంటిదే సఖి సెంటర్లు కూడా. రాష్ట్రంలో అనేక మంది మహిళలు, ఆడపిల్లలు వివిధ కారణాలు, సమస్యల చేత సమాజంలో ఒంటరి జీవితాలు గడుపుతుంటారు లేదా విధిలేని పరిస్థితులలో ఎవరి ఇంట్లోనో తలదాచుకొని దయనీయమైన జీవితాలు గడుపుతుంటారు. కానీ వారి మౌనవేదనను అర్ధం చేసుకొని ఓదార్చే ఓపిక, ఆసక్తి ఎవరికీ ఉండవు. అటువంటి ఆడబిడ్డలను ఆదుకొని మళ్ళీ వారి జీవితాలను చిగురింపజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సఖీ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. ప్రతీ జిల్లా కేంద్రంలో ఒకటి చొప్పున రాష్ట్రమంతటా వాటిని ఏర్పాటు చేయబోతోంది.
మొట్ట మొదటగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో సఖీ సెంటరును ఆర్ధికమంత్రి ఈటల రాజేందర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడుతూ, “సఖీ కేంద్రాలు అబలలకు, దగా పడిన ఆడపిల్లలకు తల్లితండ్రుల పాత్ర పోషిస్తాయని చెప్పారు. అవి వారికి అన్నివిధాల అండగా నిలబడి, వారు మళ్ళీ జీవితంలో నిలద్రొక్కుకొనేందుకు పూర్తి సహాయసహకారాలు అందిస్తాయని మంత్రి చెప్పారు. సఖీ కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని, వాటికి అన్ని వసతులతో కూడిన శాశ్విత భవనాలను నిర్మిస్తామని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.