ఒకపక్క రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు, ఉచిత విద్యుత్ వంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నా మరోపక్క నిత్యం రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. జనగామ జిల్లాలో జనగామ మండలంలోని సిద్దెంకి గ్రామానికి చెందిన ఆవుల నర్సిరెడ్డి (55), ఆవుల లక్ష్మి (47) రైతు దంపతులు ఆర్ధిక సమస్యలు భరించలేక తమ పొలంలో వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. వారిది కూడా అదే వ్యధ..అవే కష్టాలు. తమకున్న రెండెకరాల పొలంలో వరిసాగు చేశారు. సాగుకోసం, కూతురి పెళ్ళి ఇల్లు మరమత్తుల కోసం చేసిన అప్పులు వడ్డీలతో కలిపి రూ.10 లక్షలయింది. మంచి దిగుబడి వస్తే పంట అమ్మి అప్పులన్నీ తీర్చేయవచ్చనుకొన్నారు. కానీ ఈసారి సరిగ్గా పంట పండలేదు. నానాటికీ అప్పులవారి ఒత్తిడి పెరుగుతోంది. అది భరించలేక భార్యాభర్తలిద్దరూ తమ పొలంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. వారికి ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో పెద్దమ్మాయికి ఆరు నెలల క్రితమే పెళ్ళి చేశారు. దంపతులిరువురూ ఆత్మహత్య చేసుకోవడంతో ఇప్పుడు రెండో అమ్మాయి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అందరికీ అన్నం పెడుతున్న అన్నదాత రైతన్న. ఇటువంటి కష్టాల నుంచి విముక్తి పొందడానికి వారు ఆత్మహత్యలు చేసుకోవడం మనసులను కలచివేస్తుంది. ఈ పరిస్థితులు ఇంకా ఎప్పటికి మారుతాయో?