గొర్రెలు, బర్రెలు పంచితే సరిపోతుందా?

భద్రాచలంలో అంబేద్కర్ సెంటరులో గురువారం జరిగిన ఒక బహిరంగ సభలో సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం తెరాస సర్కార్, మోడీ సర్కార్, ముఖ్యమంత్రులు కెసిఆర్, చంద్రబాబులపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో బడుగుబలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించే ప్రయత్నం చేయకుండా వారికి గొర్రెలు, బర్రెలు, చేపలు పంచిపెడుతూ అదే గొప్ప విషయమన్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణా రాష్ట్రంలో 92 శాతం బడుగు బలహీనవర్గాల జనాభా ఉంది. కనుక వచ్చే ఎన్నికలలో వారికి బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ (బిఎల్ఎఫ్)లో 52 శాతం టికెట్స్ కేటాయిస్తామని చెప్పారు.

భాజపాతో కలిసిసాగితే వచ్చే ఎన్నికలలో ప్రజలు తిరస్కరిస్తారనే భయంతో చంద్రబాబు నాయుడు కొత్త డ్రామా మొదలుపెట్టారని విమర్శించారు. తెలంగాణా ప్రజలలో తెరాస సర్కార్ పట్ల నానాటికీ వ్యతిరేకత పెరిగిపోతున్న కారణంగా వారి దృష్టి మళ్ళించడానికే  కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ డ్రామా మొదలుపెట్టారని అన్నారు. ధర్డ్ ఫ్రంట్ లో తమ పార్టీ చేరబోదని స్పష్టం చేశారు. ప్రొఫెసర్ కోదండరాం, పవన్ కళ్యాణ్, చంద్రకుమార్, గద్దర్, ఆర్.కృష్ణయ్య లతో సంప్రదింపులు జరుగుతున్నాయని, వారు కూడా బిఎల్ఎఫ్ తో చేతులు కలిపుతారని భావిస్తున్నట్లు చెప్పారు. మోడీ నియంతృత్వ పోకడలు, మత అసహనం, అనాలోచిత నిర్ణయాల కారణంగా దేశంలో భాజపాకు ఎదురుగాలులు వీస్తున్నాయని కనుక కాంగ్రెస్, భాజపాలకు బిఎల్ఎఫ్ ఏకైక ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉందని అన్నారు.