మోడీ దేశాన్ని నాశనం చేసేస్తున్నారు: అమిత్ షా!!!

“ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని సర్వ నాశనం చేసేస్తున్నారు. దేశంలో దళితులకు, పేదలకు అయన చేసిందేమీలేదు...” ఈ మాట ప్రతిపక్ష నేతలు అంటే ఎవరూ ఆశ్చర్యపోరు. కానీ ఎవరన్నారో తెలుసా? భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా! 

అమిత్ షా ఏమిటి..మోడీ గురించి అలా మాట్లాడటం ఏమిటి? అని ఆశ్చర్యపోకండి. జరిగిందేమిటంటే, అయన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య...అయన ప్రభుత్వ తీరును ఉద్దేశ్యించి హిందీలో చెప్పిన మాటలను కర్ణాటక భాజపా సీనియర్ నేత ప్రహ్లాద్ జోషి పైన చెప్పిన విధంగా అనువదించారు. ఈ సంఘటన దేవనగిరి జిల్లాలో భాజపా ఎన్నికల ప్రచార సభలో జరిగింది. ప్రహ్లాద్ జోషి చెప్పిన ఆ మాటలను విని అందరూ షాక్ కు గురయ్యారు. వెంటనే పక్కనున్నవారు హెచ్చరించడంతో అయన సర్దుకొని అసలు విషయం చెప్పారు. 

ఇంతకు ముందు జరిగిన ఎన్నికల ప్రచారసభలో భాజపా ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎడ్యూరప్పను పక్కనే కూర్చోబెట్టుకొని, ‘దేశంలో ఎడ్యూరప్ప అంత అవినీతిపరుడు లేడని’ అమిత్ షా నోరు జారారు. ఈసారి పొరపాటున ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని నాశనం చేసేస్తున్నారని భాజపా నేతలే ఎన్నికల ప్రచార సభలో చెప్పుకోవడం విశేషం.  

ఎన్నికల ప్రచారంలో చిన్న చిన్న అపశ్రుతులు దొర్లడం సహజమే కానీ తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి, ప్రధాన మంత్రి, తమ ప్రభుత్వ పాలన తీరు గురించి ఇంత దారుణంగా చెప్పుకోవడం విచిత్రమే కదా! భాజపా స్వయంగా అందిస్తున్న ఈ అస్త్రశస్త్రాలను కాంగ్రెస్ పార్టీ చాలా చక్కగా వినియోగించుకొంటోంది. అమిత్ షా చాలా కాలం తరువాత తమ పార్టీ, ప్రభుత్వం, ప్రధాని మోడీ, ముఖ్యమంత్రిఅభ్యర్ధి గురించి నిజాలు మాట్లడుతున్నారని, కనుక ప్రజలందరూ మళ్ళీ తమకే ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకొంటోంది.