తెలంగాణా శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిసాయి. శాసనసభ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూధనాచారి ప్రకటించారు. ఈసారి సమావేశాలు కాంగ్రెస్ సభ్యుల ఆందోళనలతో మొదలయ్యాయి. ఆ తరువాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వరద్దు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరిపై సస్పెన్షన్ వేటుపడటంతో కాంగ్రెస్, తెరాసల మద్య మాటల యుద్ధం, న్యాయపోరాటాలు ప్రారంభం అయ్యాయి. ఆ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలో ప్రభుత్వానికి హైకోర్టులో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసివస్తోంది. కానీ కాంగ్రెస్ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసిన తరువాత శాసనసభ, మండలి సమావేశాలు చాలా ప్రశాంతంగా సాగిపోయాయి. ప్రజాసమస్యలు, అభివృద్ధి, సంక్షేమ పధకాల అమలు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన 11 బిల్లులపై ఉభయసభలలో లోతుగా అర్ధవంతమైన చర్చలు జరిగాయి.