మహబూబ్‌నగర్ (రూరల్) మండలం కోడూరులో బుధవారం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. దానిలో పాల్గొన్న కాంగ్రెస్ శాసనసభ్యురాలు డికె అరుణ మాట్లాడుతూ “కాంగ్రెస్ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లు గవర్నర్ నరసింహన్ పై దాడి చేశారంటూ వారిద్దరి శాసనసభ్యత్వాలను రద్దు చేసిన తెరాస సర్కార్, అందుకు వీడియో ఫుటేజి ఆధారాలను హైకోర్టుకు ఎందుకు సమర్పించడం లేదు? వారిరువురూ నేరం చేసారని ఆరోపించి వారిపై చర్యలు తీసుకొన్నప్పుడు, అదే...కోర్టులో రుజువు చేయడానికి తెరాస సర్కార్ ఎందుకు సంకోచిస్తోంది? తెరాస సర్కార్ అనైతిక రాజకీయాలకు మద్దతు పలకడం ఇష్టంలేకనే అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అందుకు ఆయనను అభినందిస్తున్నాము. ఒకవేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ నిర్దోషులని హైకోర్టు తీర్పు చెపితే ముఖ్యమంత్రి కెసిఆర్ తో సహా అందరూ రాజీనామాలు చేయాలి,” అని అన్నారు.
పిసిసి ఉపాధ్యక్షుడు డి. శ్రీధర్ బాబు మాట్లాడుతూ, “కాంగ్రెస్ శాసనసభ్యుల సభ్యత్వం రద్దు కేసులో వీడియో ఫుటేజిని హైకోర్టుకు సమర్పించడానికి తెరాస సర్కార్ భయపడుతోంది. ఇటువంటి అనైతిక రాజకీయాలు చేస్తునందుకు ముఖ్యమంత్రి కెసిఆర్, తెరాస మూల్యం చెల్లించుకోక తప్పదు. వచ్చే ఎన్నికలలో ప్రజలే వారికి తగినవిధంగా బుద్ధి చెపుతారు,” అని అన్నారు.