ద్రవ్య వినిమయ బిల్లుపై శాసనసభలో నిన్న చర్చ జరిగినప్పుడు భాజపా ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి కెసిఆర్ కు మద్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ‘వరంగల్ ను సింగపూర్ లాగ అభివృద్ధి చేస్తామన్నారు...ఆ సంగతి ఏమయిందని’ కిషన్ రెడ్డి ప్రశ్నించగా, ‘వరంగల్ ను సింగపూర్ లాగ అభివృద్ధి చేస్తామని మీకెవరు చెప్పారు?’ అని ముఖ్యమంత్రి కెసిఆర్ ఎదురుప్రశ్నించారు.
“మేము కరీంనగర్ ను లండన్ మాదిరిగా అభివృద్ధి చేస్తామని చెప్పాము కానీ వరంగల్ గురించి ఆ మాట చెప్పలేదు. కరీంనగర్ లో 90 కిమీ మేర గోదావరి నది పారుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే అక్కడ మానేరుడ్యాం నిత్యం నీళ్ళతో కళకళలాడుతుంది కనుక ఆ ప్రాంతాన్ని లండన్ లో థేమ్స్ నదీ తీరాన్ని అభివృద్ధి చేసినట్లు చేస్తామని చెప్పాము. ఇప్పటికే ఆ పనులు మొదలుపెట్టాము కూడా. కరీంనగర్ రూపురేఖలు ఏవిధంగా మారిపోతాయో త్వరలో మీరే చూస్తారు,” అని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.