ఈ నెల 30వ తేదీన వనపర్తిలో తెరాస బహిరంగ సభ నిర్వహిస్తోంది. దానిలో మంత్రి కేటిఆర్ పాల్గొనబోతున్నారు. స్థానిక పాలిటెక్నిక్ కాలేజీ మైదానంలో మార్చి 30వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ సభ జరుగుతుంది. దీని కోసం స్థానిక తెరాస నేతలు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
కాంగ్రెస్, తెదేపాలు వనపర్తిపై తమ పట్టు నిలుపుకొనేందుకు వరుసగా సభలు, సమావేశాలు నిర్వహిస్తుండటంతో తెరాస నేతలు కూడా రంగంలో దిగి మంత్రి కేటిఆర్ తో బహిరంగ సభ నిర్వహించడానికి సిద్దం అవుతున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి తెదేపాలో సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమవుతున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల తన అనుచరులతో సమావేశమైనప్పుడు ఆయన ఆ పుకార్లను ఖండించారు. వచ్చే ఎన్నికలలో తాను తెదేపా తరపున వనపర్తి నుంచే పోటీ చేస్తానని, ఇకపై తన నియోజకవర్గంలో అన్ని మండలాలు, గ్రామాలు పర్యటిస్తానని చెప్పారు. ఒకపక్క కాంగ్రెస్ మరోపక్క జిల్లాలో బలమైన నాయకుడిగా పేరున్న రావుల చంద్రశేఖర్ రెడ్డి స్పీడు పెంచడంతో తెరాస కూడా స్పీడు పెంచకతప్పలేదు. బహుశః అందుకే హటాత్తుగా ఈ బహిరంగ సభ అనుకోవచ్చు.