జి.హెచ్.ఎం.సి.కి అరుదైన పురస్కారం

జి.హెచ్.ఎం.సి.కి చాలా అరుదైన పురస్కారం లభించింది. అది నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వయంగా నిధుల సమీకరించుకొని తన పరిధిలో అనేక అభివృద్ధి పనులు చేపడుతోంది. అందుకు కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ జి.హెచ్.ఎం.సి.కి రూ.26 కోట్లు బహుమతిగా ప్రకటించింది. 

జి.హెచ్.ఎం.సి. బోంబే స్టాక్ ఎక్స్ చేంజ్ (బిఎస్ఈ) లో లిస్టింగ్ అయ్యి బాండ్ల ద్వారా రూ.200 కోట్లు నిధులు సమీకరించింది. అది రూ.200 కోట్లకు బాండ్లు విడుదల చేయగా మదుపరుదార్ల నుంచి అంతకు రెట్టింపు స్పందన వచ్చింది. ఆర్ధిక క్రమశిక్షణ పాటిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్న కారణంగా దేశవ్యాప్తంగా జి.హెచ్.ఎం.సి.కి మంచి పేరుందని అది నిరూపించింది. కనుక వివిధ అభివృద్ధి పనుల కోసం జి.హెచ్.ఎం.సి. రూ.3,500 కోట్లు నిధులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకొంది. బిఎస్ఈలో లిస్టింగ్ అయ్యింది కనుక సులువుగానే నిధులు సమీకరించుకోగలదు. ఈవిధంగా నిధులు సమీకరించుకొని స్వయం సంవృద్ది సాధిస్తున్నవాటిలో దేశంలో పూణే మున్సిపల్ కార్పోరేషన్ మొదటి స్థానంలో ఉండగా జి.హెచ్.ఎం.సి.రెండవ స్థానంలో ఉంది.

జి.హెచ్.ఎం.సి. కేవలం అభివృద్ధి పనులకే పరిమితం కాకుండా నగర పరిధిలో తక్కువ ధరకే నాణ్యమైన టిఫిన్లు, ఆహారం అందించే అన్నపూర్ణ క్యాంటీన్లు కూడా నిర్వహిస్తోంది. ఇక నోట్ల రద్దు సమయంలో ముందస్తు ఆస్తి పన్ను, నీటి పన్ను చెల్లించేవారికి, దుఖాణాల లైసెన్సుల రెన్యువల్స్ ఫీజులు చెల్లించేవారిని ప్రోత్సహించి బారీగా ఆదాయం సమకూర్చుకొంది. ఈవిధంగా విన్నూత్నమైన ఆలోచనలు, విధానాలతో స్వయంసంవృద్ధి సాధిస్తూ ముందుకు దూసుకుపోతున్న జి.హెచ్.ఎం.సి.కి ఈ బారీ నగదు బహుమతి అందుకోవడానికి అన్ని విధాల అర్హమైనదే.

సమైక్య రాష్ట్రంలో కూడా ఇదే జి.హెచ్.ఎం.సి. ఉంది కానీ ఏనాడూ ఈవిధంగా ప్రత్యేక గుర్తింపు సాధించలేకపోయింది. తెలంగాణా ఏర్పడి మున్సిపల్ శాఖా మంత్రిగా కేటిఆర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దాని పనితీరులో గణనీయమైన మార్పు వచ్చింది. కేవలం నాలుగేళ్లలోనే ఇటువంటి మంచి గుర్తింపు, పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడం విశేషమే.