అయినా గుణపాఠాలు నేర్చుకోరు...ఎందుకో?

ప్రజలు రాజకీయ పార్టీలను, వాటి అధినేతలను నమ్మి ఓట్లేసి గెలిపిస్తుంటారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత అసమర్ధత వలననో లేదా అహంకారం వలననో లేదా అవినీతి, రాజకీయ విభేధాల కారణాల చేతనో వారు తమ బాధ్యతలను విస్మరించి నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడు, వారికి ఓట్లేసి గెలిపించిన ప్రజలే నిర్దాక్షిణ్యంగా దించేస్తారని అనేకమార్లు రుజువయింది. 

ఉదాహరణకు పదేళ్ళు దేశాన్ని ఇష్టం వచ్చినట్లు పాలించి సంక్షోభంలోకి నెట్టివేసినందుకు 2014 ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు. అలాగే యూపిలో పదేళ్ళపాటు తిరుగులేకుండా పాలించిన సమాజ్ వాదీ పార్టీ కూడా చాలా బాధ్యాతారహిత్యంగా పాలించినందుకు ఎన్నికలలో ప్రజలు తిరస్కరించారు. 

“తెలంగాణాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏమి చేస్తారో చేసుకోండి” అని కిరణ్ కుమార్ రెడ్డి అహంకారం ప్రదర్శించినందుకు తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ప్రజల తిరస్కారానికి గురైంది. 

అయినప్పటికీ అధికారంలో ఉన్న పార్టీలు వాటిని గుణ పాఠాలుగా స్వీకరించి తమ లోపాలను సరిదిద్దుకోవడానికి ఇష్టపడకపోవడమే విచిత్రం. అధికారంలో ఉన్నప్పుడు తమకు తామే శభాషీలు ఇచ్చుకొంటూ ప్రజలందరూ తమవైపే ఉన్నారని చెప్పుకొంటూ కాలక్షేపం చేసేస్తున్నాయి. 

ఉదాహరణకు ఏపిలో తెదేపా సర్కార్ ను చెప్పుకోవచ్చు. రాష్ట్ర విభజన తరువాత తీవ్రసమస్యలలో చిక్కుకొన్న ఏపి రాష్ట్రాన్ని చంద్రబాబు అయితేనే గాడిన పెట్టగలరనే నమ్మకంతో ప్రజలు తెదేపాకు పట్టం కట్టారు. కానీ నాలుగేళ్ళ తరువాత ఏపి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. దానికి కేంద్రమే కారణమని తెదేపా వాదిస్తుంటే, కాదు మీ అవినీతే కారణమని భాజపా వాదిస్తోంది. అయితే ఇంతకాలం ఆ రెండు పార్టీలే రాష్ట్రాన్ని పాలించాయి కనుక నేటి ఈ దుస్థితికి తెదేపా, భాజపాలదే పూర్తి బాధ్యత అని చెప్పక తప్పదు. కనుక వచ్చే ఎన్నికలలో ఆ రెండూ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చరిత్ర చెపుతోంది.

తెదేపా, భాజపాలు ఒకదానిపై మరొకటి నిందవేసి తప్పించుకోవాలని చూస్తుంటే, ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవాలని జగన్మోహన్ రెడ్డి తెగ ఆరాటపడుతున్నారు. ప్రస్తుతానికి ఏపి ప్రజల ముందు వేరే ప్రత్యామ్నాయమేదీ లేదు కనుక వచ్చే ఎన్నికలలో వారు వైకాపా వైపు మొగ్గు చూపినా ఆశ్చర్యం లేదు. కానీ జగన్, విజయసాయి రెడ్డిల అక్రమాస్తుల కేసులే వైకాపా విజయానికి అవరోధంగా మారవచ్చు. ఆ ఒక్క కారణం ఏపి ప్రజలు గత్యంతరం లేని పరిస్థితులలో మళ్ళీ తెదేపానే గెలిపించినా ఆశ్చర్యం లేదు.