టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం త్వరలో రాజకీయ పార్టీ స్థాపించబోతున్న సందర్భంగా ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు:
ఈసీ అనుమతి రాగానే ఏప్రిల్ రెండవ వారంలో పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ప్రజల ఆకాంక్షల మేరకు కెసిఆర్ సర్కార్ పాలన చేయడం లేదని, ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై ఎదురుదాడి చేయడం లేదా పోలీసుల చేత వేధింపులకు పాల్పడుతోందని అన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం విరాజిల్లుతుందని ఆశిస్తే, పోలీస్ రాజ్యం సాగుతోందని అన్నారు. ఎక్కడ చూసిన అణచివేత, దాడులు, నిషేదాజ్ఞలే కనబడుతున్నాయని అన్నారు. ఈ పరిస్థితులను చూసే రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాడేందుకు మాత్రమే కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలతో కలిసి పనిచేశామే తప్ప ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ తనకు ఎటువంటి అనుబంధమూ, రహస్య అవగాహనా లేవని స్పష్టం చేశారు. తమ వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందనే ఆరోపణలను అయన ఖండించారు. గత ఎన్నికలలో తెరాస పెద్దగా ఖర్చు చేయనప్పటికీ ఏవిధంగా విజయం సాధించిందో అదేవిధంగా రాబోయే ఎన్నికలలో తమ పార్టీ కూడా ప్రజల సహకారంతోనే విజయం సాధిస్తుందని అన్నారు.
వచ్చే ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేస్తుందని పార్టీ ఏర్పాటు అయిన వెంటనే అభ్యర్ధుల పేర్లను ఖరారు చేస్తామని చెప్పారు. ఎన్నికలలో పోటీ చేయడం అధికారం దక్కించుకోవడమే తమ లక్ష్యం కానపట్టికీ, రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితులను మార్చాలంటే పోటీ చేయకతప్పదని అన్నారు.
కెసిఆర్ ఏర్పాటు చేయబోతున్న ధర్డ్ ఫ్రంట్ ను ఒక రాజకీయ స్టంట్ గా కోదండరాం అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా, నిరంకుశ పాలన సాగిస్తూ ఫ్రంట్ పెట్టి దేశాన్ని ఉద్దరిస్తానని కెసిఆర్ చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ఈ సమస్యలపై నుంచి అందరి దృష్టిని మళ్ళించడానికే కెసిఆర్ ఫ్రంట్ డ్రామా మొదలుపెట్టారని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.