శాసనసభలో గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్న సమయంలో సభలో అనుచితంగా వ్యవహరించినందుకు కాంగ్రెస్ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వం రద్దు చేయడం, స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వారిరువురూ హైకోర్టులో పిటిషన్లు వేయడం, వారి పిటిషన్లపై విచారణ పూర్తయ్యేవరకు ఉపఎన్నికలు జరుపవద్దని హైకోర్టు కేంద్ర ఎన్నికల కమీషన్ ను కోరడం అందరికీ తెలిసిన విషయాలే. అయితే ఉపఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు తెరాస సిద్దమని ప్రకటించింది.
నల్గొండ శాసనసభ నియోజకవర్గం నుంచి తెరాస అభ్యర్ధిగా నల్గొండ జిల్లా తెరాస ఇన్-ఛార్జ్ కంచర్ల భూపాల్ రెడ్డి పేరును ఖరారు చేసిందని తెరాస ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. దానిని దృవీకరిస్తూ ఉపఎన్నికలు ఎప్పుడు వచ్చినా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని డ్డీ కొని ఓడిస్తానని భూపాల్ రెడ్డి చెప్పారు. "2014 ఎన్నికలలో స్వల్ప తేడాతో ఓడిపోయాను. కానీ ఈసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాచేతిలో ఓడిపోవడం ఖాయం. అందుకే ఆయన భయంతో హైకోర్టు, ఈసీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు," అని అన్నారు.
ఇదివరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెరాసకు నల్గొండ నుంచి గెలిచి చూపాలని సవాలు విసురుతుండేవారు. ఇప్పుడు తెరాస నేతలు ఆయనకు సవాలు విసురుతున్నారు.