ఇవ్వాళ్ళ రాజ్యసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 58 రాజ్యసభ సీట్లు వచ్చే నెలలో ఖాళీ అవబోతున్నాయి. వాటికే నేడు ఆయా రాష్ట్రాలలోనే ఎన్నికలు నిర్వహించబడతాయి. వాటిలో తెలంగాణాలో 3, ఏపిలో 3 సీట్లు ఉన్నాయి.
రాష్ట్ర శాసనసభ కమిటీ హాల్-1లో ఇవ్వాళ్ళ ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహించబడుతుంది. పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం 5గంటలకు ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
శాసనసభ్యుల ఓట్లతో జరుగబోతున్న ఈ ఎన్నికలలో తెలంగాణాలో మొత్తం 117 మంది ఓటర్లు (శాసనసభ్యులు) ఉన్నారు. మూడు రాజ్యసభ సీట్లకు తెరాస ముగ్గురు అభ్యర్ధులను, కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్ధిని నిలబెట్టాయి. తెరాస తరపున జోగినపల్లి సంతోష్ కుమార్, బండా ప్రకాష్, బడుగుల లింగయ్య యాదవ్ లు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున మాజీ కేంద్రమంత్రి పి. బలరాం నాయక్ పోటీ చేస్తున్నారు.
ఇతర పార్టీల నుంచి వచ్చిన చేరిన ఎమ్మెల్యేలతో కలిపి తెరాసకు మొత్తం 90 మంది ఎమ్మెల్యేలున్నారు. వారిలో 8మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. మజ్లీస్ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా తెరాసకే మద్దతు ఇస్తారు కనుక తెరాస తన ముగ్గురు అభ్యర్ధులను గెలిపించుకోగలదు. కాంగ్రెస్ కూడా తన అభ్యర్ధిని నిలబెట్టింది కనుక తెరాసలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ ఎన్నికలకు దూరంగా ఉండే అవకాశం ఉంది.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ్యత్వం రద్దుకావడంతో ఒక్కో అభ్యర్ధికి 27మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే సరిపోతుంది. కనుక ముగ్గురు తెరాస అభ్యర్ధులను ఎంపిక చేసినప్పుడే వారి గెలుపు ఖాయం అయిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీకి కేవలం 13 మంది ఎమ్మెల్యేలు ఉండగా వారిలో ఇద్దరు శాసనసభ్యత్వం రద్దు కావడంతో 11 మందే మిగిలారు. కానీ తెరాసలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల మద్దతు లభిస్తుందనే ఉద్దేశ్యంతో అభ్యర్ధిని నిలబెట్టింది. కానీ అయనకు 27మంది ఎమ్మెల్యేల మద్దతు లేదు కనుక అయన ఓటమి కూడా ముందే ఖాయం అయిపోయింది.
నేడు ఎన్నికలు జరుగబోయే రాష్ట్రాలలో తెలంగాణా-3, ఆంధ్రప్రదేశ్-3, కర్నాటక-4, ఓడిశా-3, ఛత్తీస్ ఘడ్-1, మధ్యప్రదేశ్-5, మహారాష్ట్ర-6, బిహార్-6, గుజరాత్-4, రాజస్థాన్-3, ఉత్తర ప్రదేశ్-10,ఝార్ఖండ్-2, ఉత్తరాఖండ్-1, హర్యానా-1, హిమాచల్ ప్రదేశ్-1, పశ్చిమ బెంగాల్-5 స్థానాలు ఉన్నాయి. అయితే ఏపితో సహా 10 రాష్ట్రాలలో 33 మంది అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణా, కర్నాటక, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్ ఘడ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో మాత్రమే అధికార, ప్రతిపక్షాలు అభ్యర్ధులను పోటీకి నిలిపాయి కనుక ఈ 6 రాష్ట్రాలలో మాత్రమే పోలింగ్ జరుగుతుంది.