మార్చి 23న ఛలో అసెంబ్లీ!

తెలంగాణా శాసనసభ బడ్జెట్ సమావేశాలలో ముఖ్యమంత్రి కెసిఆర్ మొదలు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వరకు అందరూ తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని, తమ పాలనలో రైతులు సంతోషంగా జీవిస్తున్నారని, వ్యవసాయం, రైతు సంక్షేమంలో తమ ప్రభుత్వం దేశానికే ఆదర్శమని బల్లగుద్ది చెప్పుకొంటున్నారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్, భాజపా ప్రభుత్వాలు అమలుచేస్తున్న వ్యవసాయ విధానాలు సరిగ్గా లేవని, వాటిని సమూలంగా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందని వాదిస్తూ దాని కోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ సిద్దం అవుతున్నారు.  

కానీ ప్రొఫెసర్ కోదండరాం మొదలు రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ తెరాస సర్కార్ రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక సర్కార్ అని అంతే గట్టిగా వాదిస్తున్నాయి. తెరాస సర్కార్ పాలన పట్ల అసంతృప్తితో ఉన్న ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణా జన సమితి (టిజెఎస్) పార్టీ పెట్టి ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశిస్తుంటే, సిపిఎం నేతృత్వంలో బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ కెసిఆర్ ప్రభుత్వాన్ని డ్డీ కొనడానికి సిద్దపడుతోంది. 

ఇక భాజపా మరోకడుగు ముందుకు వేసి ఈనెల 23న ‘ఛలో అసెంబ్లీ’ పేరిట రైతులతో అసెంబ్లీ ముట్టడి చేయబోతున్నట్లు ప్రకటించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి కెసిఆర్ శాసనసభలో పంటరుణాల మాఫీ చేసేశామని గొప్పలు చెప్పుకొంటున్నారు. కానీ దుబ్బాకలోని దుబ్బలపల్లి, చర్లాపూర్, బల్వంతపూర్, రాజక్కపేటలో 1,600 మంది రైతులకు బ్యాంకులు అప్పులు తీర్చమని, లేకుంటే ఆస్తులు జప్తు చేస్తామని నోటీసులు జారీ చేశాయి. ప్రభుత్వం పంట రుణాలన్నిటినీ మాఫీ చేస్తే మరి వారికి బ్యాంకులు ఎందుకు నోటీసులు ఇచ్చాయి? పంట రుణాల మాఫీ తరువాత రాష్ట్రంలో 80,000 మంది రైతులు అప్పుల ఊబిలో చిక్కుకొని విలవిలలాడుతున్నారు. ఈ బాధలు భరించలేక నిత్యం రైతులు ఆత్మహత్యలు చేసుకొంటూనే ఉన్నారు. మేము ఆ రైతుల సమస్యలను శాసనసభలో ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్దామని ప్రయత్నిస్తే, అయన తెరాస సభ్యుల చేత మాపై ఎదురుదాడి చేయించి మానోళ్ళు నొక్కేసి మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా తప్పించుకుపోతున్నారు. అందుకే రేపు అంటే 23న ‘ఛలో అసెంబ్లీ’ పేరిట కిసాన్ మోర్చా అధ్వర్యంలో వేలాదిమంది రైతులతో కలిసి అసెంబ్లీని ముట్టడించి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలనుకొంటున్నాము,” అని అన్నారు.