అందుకే ఫ్రంట్: దాసోజు శ్రవణ్

టిపిసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ముఖ్యమంత్రి కెసిఆర్ పై చాలా ఘాటు విమర్శలు చేశారు. గాంధీ భవన్ లో అయన మీడియాతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి కెసిఆర్ ఒకపక్క ప్రధాని నరేంద్ర మోడీ తనకు మంచి మిత్రుడు అంటూనే, మోడీ సర్కార్ కు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని హడావుడి చేస్తూ అందరినీ మభ్యపెట్టాలని చూస్తున్నారు. రాష్ట్ర ప్రజలలో తెరాస సర్కార్ పట్ల వచ్చే వ్యతిరేకత ఉందనే సంగతి కెసిఆర్ కు తెలుసు. ఆ కారణంగా వచ్చే ఎన్నికలలో తెరాస విజయం సాధించడం కష్టమని కెసిఆర్ గ్రహించబట్టే, తన కుమారుడిని ముఖ్యమంత్రిచేసి తాను జాతీయ రాజకీయాలలోకి వెళ్ళిపోతానని ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అయన మాయమాటలను ఎవరూ నమ్మడంలేదు.

దేశంలో భాజపా వ్యతిరేక ఓట్లను చీల్చి పరోక్షంగా భాజపాకు సహాయపడేందుకే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారు. అయన నిజంగా మోడీ సర్కార్ ను వ్యతిరేకిస్తున్నట్లయితే పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాలు చర్చకు రాకుండా ఎందుకు అడ్డుపడుతున్నారు? మోడీ కనుసన్నలలో కెసిఆర్, తెరాస ఎంపిలు నడుచుకొంటున్నారని, కెసిఆర్-మోడీ మద్య రహస్య బంధం ఉందని చెప్పడానికి ఇదే ఒక తాజా ఉదాహరణ,” అని అన్నారు.