వాటిపై కేంద్రం పెత్తనం ఎందుకు? కెసిఆర్

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పుడు ఏమి మాట్లాడినా అందుకు అనుగుణంగానే మాట్లాడుతున్నారు. 

బుధవారం శాసనమండలిలో రాష్ట్ర బడ్జెట్ పై జరిగిన చర్చలో మాట్లాడుతూ, “ గద్వాల జిల్లాలోని గట్టు మండలంలోని ప్రాధమిక పాఠశాలతో కేంద్రానికి ఏమి పని? కేంద్రం చేసే పనులు కేంద్రం చేయాలి. రాష్ట్రాల పరిధిలో గల పనులను రాష్ట్రాలను చేసుకోనివ్వాలి. విద్యా, వైద్యం, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి మొదలైన రంగాలను రాష్ట్రాలకే పూర్తిగా విడిచిపెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవలసిన ఇటువంటి పనులను కూడా కేంద్రం ఎందుకు తన చేతిలో ఉంచుకోవాలనుకొంటోంది? ఉంచుకోవాలనుకొంటున్నప్పుడు వాటి అభివృద్ధికి సరిపడినన్ని నిధులు ఎందుకు విడుదల చేయడం లేదు? ఆయా పనుల పర్యవేక్షణకు స్థానికంగా కేంద్రప్రభుత్వం అధికారులను ఎందుకు నియమించుకోలేదు? రాష్ట్ర వ్యవహారాలపై కేంద్రం పెత్తనం చేయడం మానుకోవాలి. అలాగే రాష్ట్రాల నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో వెళ్ళేది ఎక్కువ. తిరిగి వచ్చే నిధులు చాలా తక్కువ. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పధకాలను కేంద్రం పదేపదే మెచ్చుకొంటుంది. కానీ వాటికోసం మేము రూ.24,000 కోట్లు అడిగితే రూ.24లు కూడా విదిలించలేదు! తెలంగాణాలో అమలుచేస్తున్న ఆరోగ్యవిధానం చాలా బాగుందని కేంద్రం మెచ్చుకొంటోంది. ఆ మోడల్ ను జాతీయస్థాయిలో అమలుచేస్తామని చెపుతోంది. మన కార్యక్రమాలు, పధకాలు బాగున్నాయని మెచ్చుకొంటూ మళ్ళీ మనకు ఈయవలసిన నిధుల కోసం డిల్లీ చుట్టూ ఎందుకు తిప్పించుకొంటోంది? రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం తగ్గించుకొన్నప్పుడే రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి,” అని అన్నారు.