డిల్లీలో నిర్భయ ఘటన తరువాత చాలా కటినమైన చట్టాలు అమలులోకి వచ్చినప్పటికీ దేశంలో నానాటికీ మహిళలపై సామూహిక అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. నానాటికీ ఆ నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయి. అన్ని రంగాలలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణా రాష్ట్రంలో కూడా అటువంటి నేరాలు జరుగుతుండటం అందరినీ తల దించుకొనేలా చేస్తున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచారం కంటే దారుణమైన నేరం జరిగింది. దుఖాణంలో చాక్లెట్ కొనుకొందామని వచ్చిన అన్నెం పున్నెం తెలియని చిన్నారి బాలికను ఎత్తుకుపోయి ఏకంగా 14 మంది అత్యాచారం చేశారు.
మణుగూరు డి.ఎస్.పి సాయిబాబా చెప్పిన దాని ప్రకారం, పాండురంగపురం గ్రామానికి చెందిన ఆ బాలిక దుఖాణంలో చాక్లెట్ కొనుకొందామని వెళ్ళినప్పుడు, అక్కడే ఉన్న కుంజా ఏసు, పోలెబోయిన భరత్, కిరణ్, వినోద్, నవీన్ ఆ చిన్నారిని ఆటోలో ఇంటివద్ద దింపుతామని చెప్పి సమీపంలో గల జానంపేట రిజర్వ్ ఫారెస్ట్ లోకి తీసుకువెళ్ళి అత్యాచారం చేశారు. ఆమె స్పృహ కోల్పోయినప్పుడు వారు తమ స్నేహితులైన ఎట్టి రాము, పాల్వంచ దివాకర్, పాల్వంచ రాజు, వాడె ప్రవీణ్, కుర్సం మురళి, కొట్టెం కన్నారావు, ఎండి గౌస్ పాషా తదితరులకు ఫోన్లు చేసి పిలిచారు. వారు కూడా అక్కడకు చేరుకొని స్పృహలో లేని ఆ చిన్నారిపై అత్యాచారం చేశారు. మొత్తం 14 మంది ఆ చిన్నారిని అత్యాచారం చేశారు. ఆ తరువాత ఆమెను అమరారం గ్రామంలో సమ్మిరెడ్డి అనే ఒక వృద్ధునికి అప్పజెప్పి వెళ్ళిపోయారు.
తన మునిమనుమరాలి వయసున్న ఆ పసిపాప పరిస్థితి చూసి జాలిపడకపోగా అతను కూడా ఆమెపై అత్యాచార ప్రయత్నం చేశాడు. ఆ బాలిక ఎలాగో అతనిని నుంచి తప్పించుకొని తన ఇంటికి చేరుకొని జరిగినదంతా తన తల్లితండ్రులకు చెప్పడంతో వారు ముందుగా గ్రామపెద్దలకు ఈవిషయం తెలియజేశారు. అయితే వారు కూడా బాలికకు జరిగిన అన్యాయం గురించి పోలీసులకు పిర్యాదు చేయకుండా నిందితులను రప్పించి పంచాయితీ పెట్టి ఆమెకు రూ.5 లక్షలు చెల్లించాలని, బాలిక తల్లితండ్రులు పోలీసులకు పిర్యాదు చేయకూడదని తీర్పు చెప్పారు. అయితే బాలిక తల్లితండ్రులు పోలీసులకు పిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకొని నిందితులందరినీ అదుపులోకి తీసుకొన్నారు. వారితోపాటు పంచాయితీ తీర్పు చెప్పినవారిని కూడా అదుపులోకి తీసుకొన్నారు. తరువాత డి.ఎస్.పి సాయిబాబా ఆదేశాల మేరకు ఎడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, నిందితులందరినీ వారి ముందు ప్రవేశపెట్టారు. నిందితుల్లో సుబ్బారావు అనే ఒకరు మాత్రం ఇంకా పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇంత హేయమైన నేరానికి పాల్పడినవారందరికీ కటినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.