కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల కమీషనర్ ను కలిసి తమ శాసనసభ సభ్యత్వాల రద్దును అమలుచేయవద్దని, త్వరలో జరుగబోయే రాజ్యసభ ఎన్నికలలో తమ ఇద్దరికీ ఓటు వేసేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేయబోతున్నారు. దీనిపై వారిరువురూ వేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు తుది తీర్పు వెలువడే వరకు (సుమారు 6వారాలు) ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని ఈసీకి సూచించింది కనుక హైకోర్టు అభ్యర్ధన మేరకు వారిరువురూ తమ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు అనుమతిస్తుందో లేదో చూడాలి.
ఈసీకి పిర్యాదు చేసేందుకు డిల్లీ చేరుకొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ మీడియాతో మాట్లాడుతూ, “తెరాస సర్కార్ నన్ను హత్య చేయించే ఉద్దేశ్యంతోనే నా ఇద్దరు గన్ మ్యాన్లను తొలగించింది. కనుక ఇకపై నాకు ఏమి జరిగినా దానిదే బాధ్యత. అయితే నేను ఇటువంటి బెదిరింపులకు భయపడే పిరికిపందను కాను. కెసిఆర్ బుల్లెట్ కంటే నా గుండె గట్టిది,” అని అన్నారు.
ఇద్దరు ఎమ్మెల్యేల శాసనసభ్యత్వం రద్దు చేయడం సబబా కాదా అనే విషయం పక్కనపెడితే, గన్ మ్యాన్లను ఏర్పాటు చేయడం, తొలగించడం పోలీసుల విచక్షణాధికారానికి లోబడి ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. ఇదివరకు తన అనుచరుడు శ్రీనివాస్ హత్య చేయబడినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వం మీద ఇదేవిధంగా ఆరోపణలు చేశారు. కానీ ఆ తరువాత ఎందుకో ఆ ఊసే ఎత్తడం లేదిప్పుడు. అంటే అప్పుడు అయన చేసిన ఆరోపణలు నిజం కాదనుకోవాలా? లేక రాజకీయ లబ్ది కోసమే ఆరోపణలు చేశారనుకోవాలా? అనే సందేహం కలుగుతుంది.