సింగరేణి కార్మికులకు శుభవార్త! సింగరేణిలో కారుణ్య నియామకాలకు వీలుకల్పించే మెడికల్ బోర్డును త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నట్లు సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు. హైదరాబాద్ లో గల సింగరేణి భవన్ లో మంగళవారం అయన అధ్యక్షతన సింగరేణి ఉన్నతాధికారులు సమావేశమయ్యి త్వరలోనే బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇదికాక సింగరేణి కార్మికులకు వారు మరో శుభవార్త కూడా వినిపించారు. ఇంతవరకు 16 రకాల జబ్బులను మాత్రమే కారుణ్యనియామకాలకు ప్రాతిపదికగా తీసుకొనేవారు. వాటికి మరో 10 రకాల జబ్బులను జోడించి ఆ సంఖ్యను 26కు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీనికి సబందించి ఉత్తర్వులను నిన్ననే జారీ చేశారు. ఈ కారుణ్య నియామకాల ద్వారా మొదటి విడతలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న సుమారు 1500 మంది కార్మికులు తమ ఉద్యోగాలను తమ కుమారులు, అల్లుళ్ళు లేదా కుటుంబ సభ్యులకు బదిలీ చేసుకొని నిశ్చింతగా పదవీ విరమణ చేయవచ్చు. సింగరేణి సంస్థ ఇదివరకే కారుణ్య నియామకాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. దానిలో కొత్తగా మరో 10 రకాల జబ్బులను చేర్చినందున త్వరలోనే మరోసారి మార్గదర్శకాలు జారీ చేయవచ్చు.