హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసుపై శాసనసభలో మజ్లీస్ సభ్యుడు అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి కేటిఆర్ సమాధానం చెపుతున్నప్పుడు, మధ్యలో భాజపా ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి కలుగజేసుకొని, “నగరంలో అన్ని ప్రాంతాలకు మెట్రో రైల్ సర్వీసులను ఏర్పాటు చేస్తున్నా ఒక్క పాతబస్తీకే ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? పాతబస్తీవాసులకు మెట్రో రైలు ఎక్కకూడదా? నగరంలో మిగిలిన అన్ని కారిడార్లలో చకచకా పనులు జరుగుతున్నాయి కానీ పాతబస్తీలో ఇంతవరకు అసలు మొదలవనే లేదు? పాతబస్తీలో మెట్రో పనులు మొదలుపెట్టాడానికి మీకు ఇంకా ఎన్నేళ్ళు సమయం కావాలి?” అని నిలదీశారు.
కిషన్ రెడ్డి ప్రశ్నకు మంత్రి కేటిఆర్ సమాధానం చెపుతూ, “అక్కడి సమస్యల గురించి మీకు కూడా తెలుసు. కానీ దీనిపై కూడా మీరు రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. పాతబస్తీలో మెట్రో కారిడార్ ఏర్పాటు చేయాలనుకొన్న మార్గంలో అనేక పురాతన కట్టడాలు, ప్రార్ధనా మందిరాలు ఉన్నాయి. కనుక వాటికి నష్టం కలుగకుండా మెట్రో కారిడార్ నిర్మించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. దానిపై మేము స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎల్ & టి సంస్థ, హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసు సంస్థ ప్రతినిధులతో చర్చిస్తున్నాము. అందరికీ ఆమోదయోగ్యమైన మెట్రో కారిడార్ నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాము. ఆ ప్రయత్నంలోనే కొంత ఆలస్యం జరుగుతోంది,” అని వివరించారు.
మంత్రి కేటిఆర్ సమాధానం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ భాజపా సభ్యులు సభ నుంచి వాకవుట్ చేశారు.