సినిమాలలో సుమోలు, బస్సులు, లారీలు గాలిలో పల్టీలు కొట్టడం చాలాసార్లే చూసి ఉంటాము. కానీ నిజ జీవితంలో అటువంటి సంఘటన ఎవరూ చూసి ఉండరు. యాద్రాద్రి భువనగిరి జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం అటువంటి ప్రమాదం జరిగింది. భువనగిరి-వరంగల్ జాతీయ రహదారిపై వెళుతున్న ఒక టిప్పర్ వాహనం టైర్ పేలిపోవడంతో అంత బారీ వాహనం బొమ్మలాగా గాలిలోకి పల్టీలుకొడుతూ ఎగిరి, పక్కనే ఉన్న బ్రిడ్జిపై పడింది. ఆ ధాటికి వాహనం బాడీ-డ్రైవర్ క్యాబిన్-చేసిస్ మూడు వేరయిపోయాయి. కొంత భాగం బ్రిడ్జిపై పడగా డ్రైవర్ క్యాబిన్, చేసిస్ రెండూ క్రిందకు వ్రేలాడుతూ ఉండిపోయాయి. ఇంకా విచిత్రమేమిటంటే, ఇంత పెద్ద ప్రమాదం జరిగినా వాహనంలో డ్రైవర్, క్లీనర్ కు ఎటువంటి ప్రమాదమూ జరుగలేదు. వాహనం గాలిలోకి లేస్తున్నప్పుడే వారిద్దరూ బయటకు దూకేయడంతో చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. మధ్యాహ్న సమయం కావడంతో రోడ్డుపై పెద్దగా ట్రాఫిక్ లేదు. కనుక పెద్ద ప్రమాదం తప్పిపోయింది. ఫోటోలో వాహనం పరిస్థితి చూస్తే ప్రమాద తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.