జనసేన పార్టీ స్థాపించి నాలుగేళ్ళు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయం ఆవరణలో బారీ బహిరంగసభ నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలు విడిచిపెట్టి పూర్తి స్థాయి రాజకీయాలలోకి వచ్చేరు కనుక ఇప్పుడు అయన ఏమి చెప్పబోతున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఊహించిన విధంగానే అయన మొదట ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వనందుకు కేంద్రాన్ని నిలదీసి, ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ తరువాత ఊహించని విధంగా అయన నేరుగా ఏపి సిఎం చంద్రబాబు నాయుడు, అయన కుమారుడు నారా లోకేష్, తెదేపా ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు, అవినీతి ఆరోపణలు చేశారు. "నారా లోకేష్ అవినీతి చంద్రబాబు నాయుడుకు కనబడటం లేదా లేక చూసి చూడనట్లు ఊరుకొంటున్నారా? మీరందరూ కలిసి రాష్ట్రాన్ని దోచుకొంటుంటే ప్రజలు చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోవాలా? రాష్ట్ర విభజన తరువాత అనేక సమస్యలతో కునారిల్లుతున్న ఏపిని అనుభవం గల మీరు మాత్రమే అభివృద్ధి చేయగలరని రాష్ట్రాన్ని మీ చేతులలో పెడితే దానిని కాపాడవలసింది పోయి దోచుకుతినడానికి మీకు మనసు ఎలా ఒప్పింది? అని పవన్ ప్రశ్నించారు.
రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి బలవంతంగా భూములు గుంజుకొన్నారు కానీ నాలుగేళ్ళు పూర్తవుతున్నా రాజధాని నిర్మాణం మొదలుపెట్టలేదని విమర్శించారు. సింగపూర్ వంటి రాజధాని కట్టే ముందు సింగపూర్ నేతల మాదిరిగా నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి వంటి లక్షణాలను అలవరుచుకోవాలని పవన్ కళ్యాణ్ బాబుకు హితవు పలికారు.
నాలుగేళ్ళపాటు ప్రజలను మాయమాటలతో మభ్యపెడుతూ కాలక్షేపం చేసేసి ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్నాయి కనుక చంద్రబాబు నాయుడు సరికొత్త డ్రామాలు మొదలుపెట్టారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను దగా చేశాయని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తెదేపా నేతలను రోజూ జనసేన నిలదీస్తుంటుందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశంలో అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని, దానిలో తెదేపా ఎమ్మెల్యేలు మంత్రులే ప్రధానపాత్ర పోషిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
ప్రజలకు భద్రత కల్పించవలసిన మీరే (చంద్రబాబు) ఒక మహిళా తహసిల్దార్ (వనజాక్షి) పై తెదేపా ఎమ్మెల్యే దాడి చేస్తే వెనకేసుకురావడం సిగ్గుచేటని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా చెలరేగిపోతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమీ చేయలేని నిసహ్హాయ స్థితిలో ఉన్నారని, అటువంటి అసమర్ధ, అవినీతి పార్టీకి వచ్చే ఎన్నికలలో గట్టిగా బుద్ధి చెపుతామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా అయన ఓటుకు నోటు కేసు గురించి కూడా ప్రస్తావించారు.
రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంద్ర జిల్లాలలో ప్రజల కష్టాలు నేను చెపితే తప్ప మీకు కనబడవా? నేను పూనుకొంటే తప్ప మీ ప్రభుత్వం ఏమీ చేయదా? అటువంటప్పుడు మీరెందుకు? మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎందుకు? అని పవన్ కళ్యాణ్ నిలదీశారు. రాష్ట్ర ప్రజల మద్య కులాల చిచ్చు పెట్టి తెదేపా సర్కార్ పబ్బం గడుపుకొంటోందని విమర్శించారు. పవన్ కళ్యాణ్ పనిలోపనిగా వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై కూడా తీవ్ర విమర్శలు చేశారు.
ఇంతకాలం పవన్ కళ్యాణ్ తెదేపాకు కష్టకాలంలో అండగా నిలబడుతూ వచ్చారు కనుక భాజపాతో తెగతెంపులు చేసుకొన్నా అయన తమకు అండగా నిలబడతాడనే ఆశతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పై ఈగ వాలకుండా జాగ్రత్త పడ్డారు. కానీ పవన్ కళ్యాణ్ ఇవ్వాళ్ళ బాబుతో సహా అందరినీ పేరుపేరునా దులిపివదిలిపెట్టారు. కనుక ఇప్పటి వరకు భాజపా, కేంద్రంతో మాటల యుద్ధం చేస్తున్న తెదేపా నేతలు రేపటి నుంచి పవన్ కళ్యాణ్ పై యుద్ధం ప్రకటించవచ్చు.