వాళ్ళిద్దరి సీట్లు ఖాళీ అయ్యాయి: తెరాస సర్కార్

కాంగ్రెస్ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి (నల్గొండ), ఎన్.ఏ.సంపత్ కుమార్ (ఆలంపూర్) ల శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు తెలంగాణా శాసనసభ కార్యాలయం మంగళవారం రాత్రి ఒక గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదేవిషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫ్యాక్స్ ద్వారా తెలియజేసి ఆ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయని తెలియజేసింది. కనుక వారిరువురి సభ్యత్వం రద్దు ఉపసంహరణపై ఇక పునరాలోచన చేసే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేసినట్లయింది. 

అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ హైకోర్టుకు వెళ్ళబోతోంది కనుక ఒకవేళ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్లయితే అప్పుడు ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవలసి రావచ్చు. కానీ సాధారణంగా శాసనసభ వ్యవహారాలలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవు కనుక వీరిరువురి విషయంలో కూడా హైకోర్టు జోక్యం చేసుకోకపోతే ఉపఎన్నికలు జరగడం తధ్యం. ఒకవేళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే అప్పుడు ఏడాది ముందుగానే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చేస్తుంది.