ముందే ముగిసిన కాంగ్రెస్ బస్సు యాత్ర

కాంగ్రెస్ నేతల ఐక్యత నేతి బీరకాయలో నెయ్యి వంటిందేనని మరోమారు నిరూపించబడింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఫిబ్రవరి 26న చేవెళ్ళ నుంచి మొదలుపెట్టిన బస్సు యాత్ర మార్చి 11 వరకు సాగవలసి ఉంది. కానీ దానిని గురువారం అర్ధాంతరంగా ముగించవలసి వచ్చింది. కారణం కాంగ్రెస్ నేతల అలకలు, కోపతాపాలే. కొందరు బస్సు యాత్రలో పాల్గొని అలుగుతుంటే మరికొందరు అలిగి బస్సు యాత్రకు దూరంగా ఉండటంతో బస్సు యాత్ర కాస్తా కప్పల తక్కెడలాగ మారింది. బస్సు యాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలలో వి. హనుమంతరావు వంటి కొందరు సీనియర్ నేతలకు కుర్చీలు లభించలేదనో, స్టేజిపై ఏర్పాటు చేసిన బ్యానర్లో తమ ఫోటో వేయలేదనో...ఇలా చిన్నచిన్న కారణాలతో నేతలు అలుగుతుంటే వారినందరినీ సముదాయించుకొంటూ నిన్నటివరకు బస్సు యాత్ర సాగించగలిగినప్పటికీ, సీనియర్ నేతల సహకరించకపోవడంతో బస్సు యాత్రను అర్ధాంతరంగా రద్దు చేసుకోక తప్పలేదు. 

కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క తదితర కాంగ్రెస్ నేతలు బస్సు యాత్ర కంటే పాదయాత్రలు చేయడానికే ఎక్కువ మొగ్గు చూపారు. కానీ ఎవరికీ వారు పాదయాత్రలు చేసుకొంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుందనే భయంతో అందరూ కలిసి బస్సు యాత్ర పెట్టుకొంటే అది కూడా అర్ధాంతరంగా ముగించడంతో టి-కాంగ్రెస్ నేతల మద్య అనైక్యత, విభేదాలు లోకానికి చాటి చెప్పుకొన్నట్లయింది. అందరూ కలిసికట్టుగా బస్సు యాత్రే పూర్తి చేయలేనప్పుడు ఇక ఎన్నికలను ఏవిధంగా ఎదుర్కోగలరు? అనే సందేహం కలిగితే తప్పు కాదు.