విభజన హామీల అమలు చేయనందుకు నిరసనగా తెదేపాకు చెందిన ఇద్దరు కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు (పౌరవిమానయాన శాఖ), సుజనా చౌదరి (సైన్స్ అండ్ టెక్నాలజీ) గురువారం సాయంత్రం తమ మంత్రి పదవులకు రాజీనామాలు చేశారు. డిల్లీలో ఉన్న వారిరువురూ ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏపి సిఎం చంద్రబాబు నాయుడుతో పలుమార్లు సంప్రదింపులు జరిపిన తరువాత సాయంత్రం కళ్యాణ్ మార్గ్ లోగల ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి వెళ్ళి కారణాలు వివరించి తమ రాజీనామా పత్రాలను సమర్పించారు.
వారిరువురి చేత రాజీనామా చేయించబోతున్నట్లు చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి ప్రకటించగానే, ఈరోజు ఉదయం అయన మంత్రివర్గంలో ఉన్న ఇద్దరు భాజపా మంత్రులు మాణిక్యాల రావు, కామినేని శ్రీనివాస్ కూడా చంద్రబాబు నాయుడును కలిసి తమ రాజీనామా పత్రాలు సమర్పించారు.
విశేషమేమిటంటే, వారు రాజీనామాలు చేయడానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా తెదేపా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వారితో చాలా ఆప్యాయంగా మాట్లాడి కలిసి ఫోటోలు కూడా తీయించుకొన్నారు. వారిరువురూ మంత్రులుగా చాలా సమర్ధంగా పనిచేశారని వారిని వదులుకోవలసి రావడం చాలా బాధ కలిగిస్తోందని చంద్రబాబు అన్నారు. వారు కూడా తెదేపాను వీడుతునందుకు చాలా బాధపడుతున్నామని చెప్పడం విశేషం. అటు డిల్లీలో ఇద్దరు కేంద్రమంత్రులు ప్రధాని నరేంద్ర మోడీని కలిసి మర్యాదపూర్వకంగా మాట్లాడి తాము ప్రభుత్వం నుంచి తప్పుకొంటున్నామని చెప్పి వచ్చారు.
ఎక్కడైనా రెండు పార్టీలు తెగతెంపులు చేసుకొంటున్నప్పుడు, ఒకదానిపై మరొకటి బురద జల్లుకోవడం అందరికీ తెలుసు కానీ ఇంత ప్రేమ,గౌరవాభిమానాలతో తెగతెంపులు చేసుకోవడం బహుశః ఇదే మొదటిసారి కావచ్చు. ఇప్పుడు ఈ పరిణామాలు ఈ సరికొత్త రాజకీయాలకు, సమీకరణాలకు దారి తీస్తాయో చూడాలి.