భాజపాతో తెదేపా కటీఫ్

ఊహించినట్లుగానే భాజపాతో తెదేపా తెగతెంపులు చేసుకొంది. విభజన చట్టంలో హామీలు అమలు చేయనందుకు, రాష్ట్రానికి తగినన్ని నిధులు విడుదల చేయకుండా ఏపికి అన్యాయం చేస్తునందుకు నిరసనగా తమ ఇద్దరు కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, సుజన చౌదరి గురువారం ఉదయం రాజీనామాలు చేస్తారని సిఎం చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి  ప్రకటించారు. ఈ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడుతూ గత మూడున్నరేళ్ళుగా తమకు కేంద్రం నుంచి ఎదురైనా చేదు అనుభవాలను వివరించి, విధిలేని పరిస్థితులలోనే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ప్రకటించారు. తన మంత్రివర్గంలో ఉన్న ఇద్దరు భాజపా మంత్రులు తమ పదవులలో కొనసాగాలో వద్దో వారే నిర్ణయించుకొంటారని అన్నారు. త్వరలోనే ఎన్డీయే కూటమిలో నుంచి బయటకు వచ్చేయలనుకొంటున్నట్లు చెప్పారు. 

కేంద్రమంత్రులను ఉపసంహరించుకోవడం అంటే భాజపాతో పొత్తులు తెంచుకొన్నట్లే కనుక చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్న ఇద్దరు భాజపా మంత్రులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ (రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ), పి. మాణిక్యాల రావు ఈరోజు తమ పదవులకు రాజీనామాలు చేయడం తధ్యమేనని చెప్పవచ్చు. వారిలో డాక్టర్ కామినేని శ్రీనివాస్ కు సిఎం చంద్రబాబు నాయుడుతో మంచి అనుబందం ఉంది. కనుక అయన భాజపాను వీడి తెదేపాలో చేరిపోయి మంత్రిగా కొనసాగినా ఆశ్చర్యం లేదు.