ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలే ఆఖరివి కావడంతో వివిధ రాష్ట్రాల, పార్టీల ఎంపిలు వారి వారి రాష్ట్రాల సమస్యల పరిష్కారం కోసం పార్లమెంటు లోపల, బయటా ఉదృతంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తుండటంతో ఈసారి బడ్జెట్ సమావేశాలు మోడీ సర్కార్ కు కత్తి మీద సాములాగ మారాయి.
ఏపి ఎంపిలు ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు చేయాలని ఆందోళన చేస్తుంటే, తెలంగాణా ప్రభుత్వం ఆమోదించిన ముస్లిం రిజర్వేషన్ బిల్లును ఏకగ్రీవ తీర్మానం ద్వారా ఆమోదించాలని కోరుతూ తెరాస ఎంపిలు ఆందోళన చేస్తున్నారు. ఏడాది క్రితం తెలంగాణా శాసనసభ ఆమోదించి పంపిన ఆ బిల్లుపై కేంద్రప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకుండా ఎందుకు కాలక్షేపం చేస్తోందని వారు ప్రశ్నించారు. ఆ బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలని కోరారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించుకొనే అవకాశం రాష్ట్రాలకే అప్పగించాలని తెరాస ఎంపి కవిత డిమాండ్ చేశారు. ఎంపిలు కవిత, జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్, బాల్కా సుమన్ లోక్ సభలో స్పీకర్ పోడియంను చుట్టుముట్టి తమ నిరసనలు తెలియజేశారు. వారిని శాంతింపజేయడానికి స్పీకర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అనంతరం వారు పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేసి తమ నిరసనలు తెలిపారు.