రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ నేత కె జానారెడ్డి చాలా సీనియర్. మంత్రి కేటిఆర్ జూనియర్. దీనిలో ఎటువంటి సందేహమూ లేదు. కనుక కేటిఆర్ జానారెడ్డిని ప్రశ్నించడం, విమర్శించడం చాలా తప్పని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే సమైక్యరాష్ట్రంలో అనేక ఏళ్ళపాటు మంత్రిగా వ్యవహరించిన జానారెడ్డి తన నల్లగొండ జిల్లాకు ఏమి చేశారో చెప్పాలని మంత్రి కేటిఆర్ ప్రశ్నించారు.
సూర్యాపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు శంఖుస్థాపన చేసిన తరువాత ప్రజలనుద్దేశ్యించి మాట్లాడుతూ, “దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీయే దేశాన్ని, రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పరిపాలించింది. దాని హయంలో తెలంగాణాకు తీరని అన్యాయం జరిగింది. టి-కాంగ్రెస్ నేతలు తమ ప్రభుత్వ హయంలో తెలంగాణా అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఏమీ చేయకపోయినా ఇప్పుడు మేము చేస్తుంటే అడ్డుపడుతున్నారు. మాపై లేనిపోని విమర్శలు, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. పైగా వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్ధయాత్రలకు బయలుదేరినట్లుగా, తెలంగాణాకు అన్యాయం చేసిన టి-కాంగ్రెస్ నేతలు నిసిగ్గుగా బస్సు యాత్రలు చేస్తున్నారు. ఈ మూడున్నరేళ్ళలో మా ప్రభుత్వం తెలంగాణాలో అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేస్తోంది. అనేక విన్నూత్నమైన సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, ఈ సంక్షేమ కార్యక్రమాలను కేంద్రప్రభుత్వంతో సహా ఇతర రాష్ట్రాలు కూడా మెచ్చుకొంటున్నాయి కానీ టి-కాంగ్రెస్ నేతలకు అవేమీ కనబడనట్లు బస్సు యాత్రలు చేస్తూ మా ప్రభుత్వం పై బురదజల్లుతున్నారు. వారికి ప్రజలే వారికి తగిన విధంగా బుద్ధి చెపుతారు,” అని అన్నారు.