ప్లీనరీ వేదిక నుంచే ధర్డ్ ఫ్రంట్ శంఖారావం

తెరాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏటా ఏప్రిల్ 25-27మద్య ప్లీనరీ సభలు నిర్వహిస్తుంటుంది తెరాస. ఈసారి వాటిని హైదరాబాద్ లో నిర్వహించబోతున్నట్లు తాజా సమాచారం. ఇప్పటి వరకు జరిగిన ప్లీనరీ సభలలో తెరాస సర్కార్ చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించడానికి, రాష్ట్రంలో తెరాసను బలోపేతం చేసుకోవడానికి ఉపయోగించుకొనేవారు. ఈ ఏడాది చివర్లో లేదా 2019 ఏప్రిల్ లోగా సార్వత్రిక ఎన్నికలు జరుగబోతున్నందున తెరాస ప్లీనరీలో రాష్ట్ర రాజకీయాలపై మరింత ఎక్కువ చర్చ జరిగే అవకాశం ఉంటుందని, రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడానికి పార్టీకి ముఖ్యమంత్రి కెసిఆర్ దిశానిర్దేశం చేస్తారని వేరే చెప్పనవసరం లేదు.  అయితే కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించాలనుకొంటున్నందున, ఈసారి ప్లీనరీ సభలకు వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులను కూడా ఆహ్వానించి వారి సమక్షంలోనే ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నేతలను ప్లీనరీకి ఆహ్వానించడం ద్వారా రాష్ట్రంలో తెరాసకు ఎంత బలం, ప్రజాధారణ ఉందో వారు స్వయంగా చూసి తెలుసుకోగలుగుతారు కనుక ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు వారు కెసిఆర్ కు సహకరిస్తారనే ఆలోచనతోనే ప్లీనరీ వేదికగా ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు శంఖారావం పూరించాలని కెసిఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కనుక ఈసారి ప్లీనరీ సభలు మరింత అట్టహాసంగా, భారీ స్థాయిలో నిర్వహించడం ఖాయం.