తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించి కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయంగా ‘ధర్డ్ ఫ్రంట్’ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించగానే సహజంగానే ఆ రెండు పార్టీల నేతలు ఉలిక్కిపడి అయనపై విమర్శలు మొదలుపెట్టేశారు.
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కూడా చాలా ఘాటుగా స్పందించారు. అయితే అయన వాదన అర్ధరహితంగా సాగడం విశేషం.
అయన చెప్పిన విషయాలను పాయింట్లు వారిగా చూస్తే అది అర్ధమవుతుంది.
1. కెసిఆర్, కేటిఆర్ తమ కేసుల నుంచి బయటపడేందుకే డిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు.
ప్రశ్న: ఒకవేళ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నట్లు వారిరువురూ కేసులలో ఇరుక్కొని వాటి నుంచి బయటపడాలంటే కేంద్రానికి మరింత అణుకువగా మెలుగుతూ బయటపడే ప్రయత్నం చేస్తారు కానీ ధర్డ్ ఫ్రంట్ పెట్టి మోడీ సర్కార్ ను దింపేస్తానని చెప్పుకోరు కదా?
2. మోడీకి నిలువరించేందుకు చంద్రబాబు ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి తెర వెనుక ప్రయత్నాలు చేశారు. ఆ సంగతి పసి గట్టిన మోడీ బాబును కట్టడి చేసేందుకే కెసిఆర్ ను కేసులపేరుతో భయపెట్టి ‘ధర్డ్ ఫ్రంట్’ డ్రామా మొదలుపెట్టించారు. దీని వెనుక నాగపూర్ కు చెందిన ఆర్.ఎస్.ఎస్. పెద్దలున్నారు.
ప్రశ్న: ఒకవేళ చంద్రబాబు ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లయితే, ఓటుకు నోటు కేసుతో నేరుగా ఆయననే కేంద్రం కట్టడి చేయవచ్చు కదా? అలా చేయకుండా కెసిఆర్ ను పావుగా ఉపయోగించుకోవలసిన అవసరమేమిటి? బాబును కట్టడి చేయడానికి కెసిఆర్ వంటి సమర్దుడైన నాయకుడిని జాతీయ రాజకీయాలలోకి రప్పించడం అంటే భాజపాకు కొరివితో తల గోక్కోవడమే అవుతుందని తెలియదా?
నిజానికి కెసిఆర్ కాకుండా దేశంలో మరో ముఖ్యమంత్రి ఎవరైనా ధర్డ్ ఫ్రంట్ ప్రతిపాదన చేసి ఉండి ఉంటే బహుశః కాంగ్రెస్, భాజపాలతో సహా ఎవరూ పట్టించుకొని ఉండేవారుకారని చెప్పవచ్చు. గతంలో కొన్నిసార్లు ఇటువంటి ప్రయత్నాలు జరిగినప్పుడు కూడా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అందరూ ఇంతగా ఎందుకు స్పందిస్తున్నారంటే, దానికి రెండు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి.
1. ఆరున్నర దశాబ్దాలుగా పోరాడినా సాధించలేని తెలంగాణా రాష్ట్రాన్ని కెసిఆర్ 12 ఏళ్ళ పోరాటంతో సాధించి చూపి తన నాయకత్వ లక్షాణాలను లోకానికి తెలియజేయగలిగినందుకు.
2. మూడున్నరేళ్ళ క్రితం తెలంగాణా తన ఉనికిని చాటుకోవలసిన పరిస్థితి! ఇప్పుడు తెలంగాణా దేశానికే రోల్ మోడల్ గా సగర్వంగా నిలబడి ఉంది. ఆ క్రెడిట్ కెసిఆర్ దేనని అందరికీ తెలుసు. అందుకే కెసిఆర్ ఈ ప్రతిపాదనను ఏదో ఆషామాషీగా చేయలేదని అందరూ నమ్ముతున్నారు. ఈ సంగతి కెసిఆర్ ను విమర్శిస్తున్న కాంగ్రెస్, భాజపా నేతలకు కూడా బాగా తెలుసు. అందుకే వారు కూడా ఉలిక్కిపడి విమర్శలు గుప్పిస్తున్నారని చెప్పవచ్చు.