వ్యవసాయం, సాగునీటి రంగాలలో కేంద్రప్రభుత్వం విధానాలు బాగోలేవని, వాటిని సమూలంగా మార్చడానికి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకొంటున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటిస్తున్న రోజునే రాష్ట్రంలో ఏడుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. దాదాపు అందరివి ఒకే రకమైన కష్టాలు..పంటలు సరిగ్గా పండక, పండిన పంటలకు గిట్టుబాటుధర లభించక, ఆ కారణంగా చేసిన అప్పులు తీర్చలేక..అప్పులవాళ్ళ ఒత్తిడి, అవమానాలు భరించలేక నిరాశా నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకొన్నారు. పంటలను కాపాడుకోవడానికి ఉపయోగపడవలసిన పురుగుల మందు వారి సమస్యలకు పరిష్కారంగా మారడం చాలా బాధాకరం.
పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
1. మాలోత్ లక్ష్మా (45): పత్తి, మిర్చి రైతు. ఖమ్మం జిల్లాలో కారేపల్లి మండలంలోని చీమలపాడు గ్రామం. అప్పు రూ.4 లక్షలు.
2. నాగేశ్వర్ (42): పత్తి రైతు. సంగారెడ్డి జిల్లా, సదాశివపేట మండలం, పొట్టిపల్లి గ్రామం. అప్పు: రూ.3 లక్షలు.
3. రాచకొండ మహేష్ (25): పత్తి రైతు. రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండలం, కందికట్కూర్ గ్రామం. అప్పు: రూ.3 లక్షలు.
4. కదుర్ల భద్రయ్య: కౌలు రైతు. కరీంనగర్ జిల్లా, జమ్మికుంట మండలం, తనుగుల గ్రామం. అప్పు: రూ.5 లక్షలు.
5. తిప్పారపు బాలమ్మ (47): పత్తి, వరి రైతు. కరీంనగర్ జిల్లా, సైదాపూర్ మండలం, ఘన పూర్. అప్పు: 3 లక్షలు.
6. పోలె రాములమ్మ (45) : పల్లి, వరి రైతు. నాగర్ కర్నూల్ జిల్లా, బల్మూర్ మండలం, జిన్నుకుంట గ్రామం. అప్పు: రూ.3 లక్షలు.
7. తిపిరెడ్డి మహిపాల్ రెడ్డి (32) వికలాంగుడు: నిజామాబాద్ జిల్లా, కమ్మర్ పల్లి మండలం, కోనాపూర్ గ్రామం. అప్పు రూ.2 లక్షలు.