తెలంగాణా-ఛత్తీస్ ఘర్ సరిహద్దు గ్రామాలలో మొన్న ఉదయం జరిగిన ఎన్కౌంటర్ లో 10 మంది మావోయిస్టులు చనిపోవడంతో సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ చాలా తీవ్రంగా స్పందించారు.
మీడియాకు పంపిన ఒక లేఖలో “ఇకపై తెరాస నేతలను లక్ష్యంగా చేసుకొని మేము దాడులు చేస్తాం. హిందుత్వ నాయకుడు (ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి) రమణ్ సింగ్, నియంత కెసిఆర్ ఇద్దరూ కలిసి తమను ప్రశ్నిస్తున్నవారి గొంతు నొక్కేందుకే ఈ దుర్మార్గానికి ఒడిగట్టారు. ఏపి, తెలంగాణా, ఛత్తీస్ ఘర్, మహారాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రప్రభుత్వం ప్రజల సొమ్మును కార్పోరేట్ శక్తులకు దోచిపెడుతున్నాయి. తమని ప్రశ్నిస్తున్నవారిని ఈవిధంగా ఎన్కౌంటర్ చేసి హత్య చేస్తున్నాయి. ఇటువంటి ఎన్కౌంటర్లకు మేము భయపడము..వెనక్కు తగ్గే ప్రసక్తి లేదు. మావోయిస్ట్ అగ్రనేతలు హరిభూషణ్, బడే చొక్కారావు, కంకణాల రాజిరెడ్డి ఎన్కౌంటర్ లో చనిపోయారని అబద్దాలు ప్రచారం చేస్తూ మా మనో ధైర్యాన్ని దెబ్బ తీయాలని పోలీసులు కుటిలయత్నం చేస్తునారు. అయితే వారు ముగ్గురూ క్షేమంగా ఉన్నారు. చనిపోయిన వారిలో జిల్లా కమిటీ సభ్యుడు స్వామీ అలియాస్ ప్రభాకర్, రత్న ఉన్నారు,” అని లేఖలో పేర్కొన్నారు.