మాజీ కేంద్ర ఆర్ధికమంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తి చిదంబరాన్ని బుధవారం ఉదయం సిబిఐ అధికారులు చెన్నై విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. అతని తండ్రి కేంద్ర ఆర్దికమంత్రిగా ఉన్నప్పుడు ఫారెన్ ఎక్స్ చేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనలకు విరుద్దంగా కార్తి చిదంబరం డైరెక్టరుగా ఉన్న ఐ.ఎన్.ఎక్స్. మీడియాలో మారిషస్ నుంచి పెట్టుబడులు స్వీకరించిందనే ఆరోపణలున్నాయి. ఆ కేసులో సిబిఐ అధికారులు కార్తి చిదంబరాన్ని చెన్నై విమానాశ్రయంలోనే కొంతసేపు ప్రశ్నించిన తరువాత అరెస్ట్ చేసి అక్కడి నుంచే నేరుగా డిల్లీకి తరలించారు. అక్కడ మళ్ళీ ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా ప్రశ్నించినప్పుడు కార్తి చిదంబరం నుంచి సంతృప్తికరమైన జవాబులు లభించకపోతే, సిబిఐ కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించే అవకాశం ఉంది. తరువాత సిబిఐ కోర్టు అనుమతితో మళ్ళీ అతనిని కస్టడీలో తీసుకొని విచారించవచ్చు. దీనిపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజకీయ వేధింపులుగానే భావిస్తున్నామని, ఇటువంటి వాటికి తాము భయపడబోమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అన్నారు.