మోడీ-కెసిఆర్ కలిసి డ్రామా: జీవన్ రెడ్డి

ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న తెలంగాణా రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహన సమావేశంలో కాంగ్రెస్, భాజపాలపై తీవ్ర విమర్శలు చేసి, నేడు దేశంలో రైతులు ఈ దుస్థితిలో ఉండటానికి కారణం ఆ రెండు పార్టీలేనని తేల్చి చెప్పారు. కెసిఆర్ విమర్శలపై రాష్ట్ర భాజపా నేతలు ఇంకా స్పందించలేదు. కాంగ్రెస్ నేతలు స్పందించడం మొదలుపెట్టారు. 

సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “తెరాస, భాజపాలు పైకి బద్ధ శత్రువులులాగ నటిస్తున్నప్పటికీ ఆ రెంటి మద్య రహస్య అవగాహన ఉంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాని నరేంద్ర మోడీతో కుమ్మక్కు అయ్యి రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తూ తెలంగాణాకు తీరని అన్యాయం చేస్తున్నారు. విభజన చట్టంలో తెలంగాణా రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలుచేయాలని కెసిఆర్ కేంద్రాన్ని గట్టిగా నిలదీయకపోవడమే అందుకు నిదర్శనం. బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగినా కెసిఆర్ నోరు విప్పలేదు. రాష్ట్రంలో రైతులు మద్దతుధర ఇవ్వమని అడిగితే ఇవ్వకుండా కేంద్రాన్ని నిందిస్తూ తన బాధ్యత నుంచి తప్పించుకొంటున్నారు. అక్కడ కేంద్రంలో మోడీ సర్కార్, ఇక్కడ రాష్ట్రంలో కెసిఆర్ సర్కార్ రెండూ కూడా ఎన్నికల హామీలను అమలుచేయకుండా ప్రజలను మోసం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో తెరాస, భాజపాలకు ప్రజలు బొందపెడతారు,” అని అన్నారు.