సిఎం కెసిఆర్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ లో పొగలు!

ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం ఉదయం కరీంనగర్ నుంచి పెద్దపల్లికి హెలికాఫ్టర్ లో బయలుదేరుతుందగా, లోపల ఉన్న ఇక బ్యాగులో నుంచి పొగలు వస్తున్నట్లు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించడంతో అందరూ అప్రమత్తమయ్యారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆ బ్యాగును తీసుకొని హెలికాఫ్టర్ కు దూరంగా పరుగెత్తుకొని తీసుకువెళ్ళి పడేశారు. తరువాత ఆ బ్యాగు తెరిచిచూడగా, దానిలో వారుపయోగించే వైర్ లెస్ సెట్ లో నుంచి పొగలు వస్తున్నట్లు కనుగొన్నారు. దానిలో బ్యాటరీ వేడెక్కిపోవడం వలన పొగలు వస్తున్నట్లు గుర్తించడం అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. హెలికాఫ్టర్ లో మళ్ళీ మరొకసారి క్షుణ్ణంగా తనికీ చేసిన తరువాతే బయలుదేరడానికి సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చారు. హెలికాఫ్టర్ ఇంకా బయలుదేరక మునుపే ఈ ఘటన జరుగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 

దీనిపై మంత్రి కేటిఆర్ స్పందిస్తూ “ఇప్పుడే ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో మాట్లాడాను. కెసిఆర్ క్షేమంగానే ఉన్నారని తెలిసింది. అయన ఆదిలాబాద్ పర్యటనకు వెళ్ళినట్లు అధికారులు తెలిపారు,” అని ట్వీట్ చేశారు.