నటి శ్రీదేవి అనుమానాస్పద మృతి..తదనంతర పరిణామాలపై మీడియాలో వస్తున్న వార్తలను యావత్ దేశప్రజలు చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రజలే కాదు తెలంగాణా పోలీసులు కూడా చాలా నిశితంగా పరిశీలిస్తున్నారని హైదరాబాద్ అడిషనల్ డి.ఎస్.పి. ఎం.శ్రీనివాస్ మాటలను బట్టి అర్ధమవుతోంది.
ఈ కేసు గురించి అయన మీడియాతో మాట్లాడుతూ, “శ్రీదేవి మృతిపై మీడియాలో చూపిస్తున్నది అసలు ఫోరెన్సిక్ నివేదిక కానే కాదు. అది ఒక అధికారి అభిప్రాయం అయ్యుండవచ్చు. ఎందుకంటే, ఆమె ఏవిధంగా చనిపోయారు? ఆ సమయంలో ఆమె ఆల్కహాల్ సేవించి ఉన్నారా? లేదా?వంటి సాంకేతిక అంశాలను మాత్రమే పోస్ట్ మార్టం నివేదికలో పేర్కొంటారు తప్ప పొరపాటున స్పృహ తప్పి బాత్ టబ్ లో పడి చనిపోయారని చెప్పరు. కనుక నివేదికలో ‘యాక్సిడెంటల్ డ్రౌనింగ్’ అనే పదం వాడటం ఉండదు. ఆమె పొరపాటున పడిపోయారా...లేదా? అనే విషయం తేల్చవలసినవారు పోలీసులే తప్ప ఫోరెన్సిక్ వైద్యులు కాదు. కనుక మీడియాలో ‘ఫోరెన్సిక్ రిపోర్ట్’ పేరుతో వస్తున్న వార్తలు నిజం కాదు. బహుశః అది ఒక అధికారి అభిప్రాయం కావచ్చు. ‘ఫోరెన్సిక్ రిపోర్ట్’ లో ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు, వివరణలు ఉంటాయి,” అని అన్నారు.