కాంగ్రెస్ లో నుంచి తెరాసలో చేరిన ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డిని తెలంగాణా రైతు సమన్వయ సమితి కార్పోరేషన్ కు చైర్మన్ గా నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న ప్రకటించారు. రాజేంద్రనగర్ వ్యవసాయవిద్యాలయంలో నిన్న జరిగిన తెలంగాణా రైతు సమన్వయ సమితి అవగాహన సదస్సులో కెసిఆర్ మాట్లాడుతూ, “గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక రైతు బిడ్డ. అయనకు రాజకీయాల కంటే వ్యవసాయంపైనే మక్కువ ఎక్కువ. 60-70 ఎకరాలు సాగుభూమి ఉంది. అందుకే అయన హైదరాబాద్ లో కంటే తన పొలంలోనే ఎక్కువ కనబడుతుంటారు. నల్లగొండ జిల్లాలో పాడిపరిశ్రమను బాగా అభివృద్ధి చేశారు. వ్యవసాయానికి సంబంధించిన ప్రతీ విషయంపై ఆయనకు మంచి అవగాహన ఉంది. ఆయన ఒక పెదకాపు. అయన నేతృత్వంలో తెలంగాణా రైతు సమన్వయ సమితిలు సమర్ధంగా పనిచేస్తాయని నమ్మకం నాకుంది. అందుకే అయనను మన పెదకాపుగా పెట్టుకున్నాం. అయనపైన మరొక పెదకాపు మనకున్నారు. ఆయనే వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. అయన కూడా రైతు బిడ్డే. ఇద్దరూ కలిసి రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి చూపాలని కోరుకొంటున్నాను,” అన్నారు.