వచ్చే ఎన్నికలలో విజయం సాధించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టేసింది. టి-కాంగ్రెస్ నేతలు అందరూ కలిసి సోమవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టబోతున్నారు. ఆలయం, దర్గా, చర్చిలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత బస్సు యాత్ర మొదలుపెట్టి ఈరోజు సాయంత్రం వికారాబాద్ లో బహిరంగసభ నిర్వహిస్తారు. మంగళవారం తాండూరు, సంగారెడ్డి, బుధవారం జహీరాబాద్, నారాయణ్ ఖేడ్ లలో బహిరంగ సభలు నిర్వహిస్తారు.
హోలీ పండుగ సందర్భంగా మార్చి 1 నుంచి 3 వరకు బస్సు యాత్రకు విరామం తీసుకొంటారు. మళ్ళీ మార్చి 4న భోధన్ నుంచి మార్చి 9 వరకు బస్సు యాత్ర సాగిస్తారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు మార్చి 10 నుంచి ఏప్రిల్ 1వరకు బస్సు యాత్రకు విరామం తీసుకొంటారు. మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి మే 15 వరకు బస్సు యాత్రలు చేస్తారు. అనంతరం టి-కాంగ్రెస్ నేతలు పాదయాత్రలు చేసే అవకాశం ఉంది. ఈ యాత్రల ముగింపు సందర్భంగా జూన్ 2న హైదరాబాద్ లేదా వరంగల్ లో బారీ బహిరంగ సభ నిర్వహించాలని టి-కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.