రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగులకు ఒక శుభవార్త!మూడు నెలల పాటు రేయింబవళ్ళు శ్రమించి భూరికార్డులను ప్రక్షాళన చేసినందుకు రెవెన్యూ ఉద్యోగులు అందరికీ ఒక నెల జీతం ప్రోత్సాహకం (బోనస్) గా ఇవ్వాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. ఈ భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో పాల్గొన్న 10,809 మంది రెవెన్యూ ఉద్యోగులకు, 24,410 విఏ.ఓ.లకు, 530 మంది సర్వే విభాగం ఉద్యోగులతో కలిపి మొత్తం 35,749 మందికి ఒకనెల జీతం అధనంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. గత 80 ఏళ్ళుగా ఏ ప్రభుత్వమూ పట్టించుకోని కారణంగా భూరికార్డులన్నీ అస్తవ్యస్తంగా మారాయి.
రెవెన్యూ రికార్డులలో ఉన్న భూవివరాలకు, వ్యవసాయ శాఖలో ఉన్న భూరికార్డులకు ఎక్కడా పొంతన ఉండేది కాదు. ఆ కారణంగా ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పధకాల అమలులో ఖచ్చితత్వం ఉండేది కాదు. ఏటా వందల కోట్లు ఖర్చు అయ్యేదే కానీ అందుకు తగ్గ ఫలితాలు కనబడేవి కావు. ఈ పరిస్థితులను సరిదిద్దాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో సమగ్ర భూసర్వే నిర్వహించి భూరికార్డులను సమూలంగా ప్రక్షాళన చేయించారు. ఆయన నిర్దేశించిన ఈ లక్ష్యాన్ని సాధించేందుకు క్షేత్రస్థాయిలో అహర్నిశలు తిరిగి విజయవంతంగా భూరికార్డులలను సరిచేసినందుకు వారికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ చిరుకానుక అందించడం చాలా అభినందనీయం. రెవెన్యూ ఉద్యోగులు కూడా తమ శ్రమకు తగిన గుర్తింపు లభించినందుకు చాలా సంతోషిస్తున్నారు.