మేడారంకు ఇవేమీ కష్టాలు?

మేడారం జాతర గొప్పదనం అందరికీ తెలిసిందే. సుమారు 1.25 కోట్లు మంది భక్తులు పాల్గొన్నారు. వనదేవతలను దర్శించుకొన్నారు. మొక్కులు చెల్లించుకొన్నారు. ఊహించిన దానికంటే ఘనంగా భక్తులు నగదు, వెండి, బంగారు ఆభరణాల రూపంలో కానుకలు సమర్పించుకొన్నారు. అంతమంది భక్తులు వచ్చినా ఎటువంటి అవాంచనీయమైన ఘటన జరుగకుండా ప్రశాంతంగా జాతర ముగిసిపోయింది. ఇది నాణేనికి ఒక పక్కన కనిపించేది. మరోపక్కన చూస్తే 1.25 కోట్లు మంది భక్తుల మలమూత్రాలు, వారు కోసిన కోళ్ళు, మేకల రక్తం, వాటి కళేబరాలు, ఉపయోగించి పడేసిన ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, కాగితాలు, గుడ్డముక్కలు, ఇతర వ్యర్ధాలతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ నిండిపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది.ఆ కారణంగా ఈగలు, దోమలు పెరిగిపోయాయి.  మేడారం పరిసర ప్రాంతాలు, రైతుల పొలాలు అన్నీ పెద్దపెద్ద చెత్తకుప్పలుగా మారిపోయాయి. మేడారం జాతర ఏర్పాట్ల కోసం అధికారులు పొక్లేయిన్ యంత్రాలతో చుట్టుపక్కల పొలాలను, భూములను చదును చేయడంతో రైతులు తమ పొలాల సరిహద్దులు గుర్తించలేక నానా అవస్థలు పడుతున్నారు. 

మేడారం జాతరకు ముందు మంత్రులు, అధికారులు అందరూ వచ్చి పోతుండటంతో అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. కానీ ఇప్పుడు అక్కడ పేరుకుపోయిన వ్యర్ధాలను తొలగించి ఆలయ పరిసర ప్రాంతాలను శుభ్రపరిచే నాధుడే కనబడటం లేదని మేడారంలో  సమ్మక్క ఆలయ పూజారి కొక్కెర క్రిష్ణయ్య, కన్నెపల్లిలో సారలమ్మ ఆలయ పూజారి కాక సారయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు వారాల క్రితం అత్యంత పవిత్రంగా విరాజిల్లిన మేడారం పరిసర ప్రాంతాలు ఇప్పుడు మలమూత్రాలతో, జంతువుల కళేబరాలతో, పెంటకుప్పలతో నిండిపోయిందని అవేధన వ్యక్తం చేశారు. కనుక అధికారులు ఇప్పటికైనా మేల్కొని తక్షణమే ఆలయ పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.